
రాహుల్ ఆగయా..
రాహుల్ వచ్చేశారు! 56 రోజుల సెలవులు తర్వాత ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు.
థాయ్ స్పెషల్
56 రోజుల సెలవుల తర్వాత ఢిల్లీకి చేరుకున్న రాహుల్
బ్యాంకాక్ నుంచి విమానంలో రాక..
మీడియాతో మాట్లాడకుండా నేరుగా తన నివాసానికి
రాహుల్ వచ్చేశారు! 56 రోజుల సెలవులు తర్వాత ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. గురువారం ఉదయం 11.15 గంటలకు థాయ్ ఎయిర్‌వేస్ విమానంలో బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి వచ్చిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ.. వచ్చిన తర్వాత కూడా మీడియా కంటపడకుండా జాగ్రత్తపడ్డారు. కారులో నేరుగా తన నివాసానికి వెళ్లారు.
న్యూఢిల్లీ: రాహుల్‌గాంధీ వచ్చేశారు! 56 రోజుల సెలవుల తర్వాత ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. గురువారం ఉదయం 11.15 గంటలకు థాయ్ ఎయిర్‌వేస్ విమానంలో బ్యాంకాక్ నుంచి ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్.. వచ్చిన తర్వాతా మీడియా కంటపడకుండా జాగ్రత్తపడ్డారు. కారులో నేరుగా తన నివాసానికెళ్లారు. ఇంటివద్ద పెద్ద ఎత్తున మీడియా ప్రతినిధులు ఉన్నా వారితో మాట్లాడకుండా వెళ్లిపోయారు. ఆయన రాక సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనింటి ముందు బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. రాహుల్ రాకకు ముందే తల్లి సోనియాగాంధీ, సోదరి ప్రియాంక.. తుగ్లక్ లేన్‌లోని ఆయన ఇంటికి చేరుకుని వేచి చూశారు. రెండు గంటలపాటు తన ఇంట్లో గడిపిన రాహుల్ తర్వాత 10 జన్‌పథ్‌లోని సోనియా నివాసానికి వెళ్లారు. సరిగ్గా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు రాహుల్ అజ్ఞాతంలోకి వె ళ్లారు.
ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నారన్నది గోప్యంగా ఉంచారు. ఫిబ్రవరిలో కీలకమైన పార్లమెంట్ భేటీ సమయంలో ఆయన సెలవులపై వెళ్లడంతో ఊహాగానాలు వచ్చాయి. పార్టీ నిర్వహణలో తగిన స్వేచ్ఛ లేకపోవడంపై అసంతృప్తితోనే రాహుల్ అజ్ఞాతంలోకి వెళ్లారని వార్తలొచ్చాయి. కొందరు పార్టీ నేతలు ఆయన నాయకత్వ పటిమపై సందేహాలు లేవనెత్తారు. కాగా, రాహుల్ రాకను బీజేపీ ఎద్దేవా చేసింది. ఇన్ని రోజులు ఆయన ఎక్కడికి వెళ్లారు, అసలు రాజకీయాల్లో కొనసాగుతారా లేదా అన్న విషయాన్ని ప్రజలకు చెప్పాలంది. రాహుల్ ఇక పార్టీకి కొత్త జవసత్వాలు అందిస్తారని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా చెప్పారు.
రాహుల్ మయన్మార్ వెళ్లారా లేదా మెడిటేషన్ కోర్సుకు వెళ్లారా అని అడగ్గా.. సమాధానం చెప్పలేదు. భూసేకరణ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఈనెల 19న ఢిల్లీలో ‘కిసాన్-ఖేత్ మజ్దూర్’ పేరుతో తలపెట్టిన ర్యాలీలో రాహుల్ ప్రసంగిస్తారని సమాచారం. దీనిపై ఆయన శుక్రవారం రైతు నేతలతో భేటీ అవుతారు. ఏఐసీసీ ఆఫీస్ బేరర్లనూ కలుసుకుంటారు. త్వరలో సొంత నియోజకవర్గమైన అమేథీలో పర్యటిస్తారు.