అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాలను చేజార్చుకున్న కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకుంటుందని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు.
పనాజీ: అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాలను చేజార్చుకున్న కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకుంటుందని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. గాంధీ కుటుంబం నుంచి ప్రియాంక గాంధీ రాక తిరిగి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని పెంచుతుందని, గతంలో ఉన్న ర్యాంక్ను ఇస్తుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం నాలుగు రాష్ట్రాల్లో పార్టీ ఓటమిని కేంద్ర నాయకత్వంతో వేరు చేసి చూడాలని చెప్పారు.
'ప్రియాంక రాజకీయాల్లో లేరు. ఆమె వస్తే అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో సంతోషాన్ని నింపుతుంది' అని చెప్పారు. ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ అస్సోమా, తమిళనాడా, కేరళానా అని చూడకుండా ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పుకు ఎవరైనా శిరసు వంచాల్సిందేనని చెప్పారు. ఈ ఓటమి పార్టీ బాధ్యతలు రాహుల్ గాంధీకి అప్పజెప్పే అంశంపై ప్రభావాన్ని చూపిస్తుందా అని ప్రశ్నించగా దానికి దీనికి సంబంధం ఏమిటని అన్నారు. త్వరలోనే కాంగ్రెస్ పుంజుకుంటుందని చెప్పారు.