వలస కూలీలకు ఉపాధి

PM Narendra Modi launches Rs 50000 crore Garib Kalyan Rojgar Abhiyaan - Sakshi

రూ. 50 వేల కోట్లతో పథకం ప్రారంభించిన మోదీ

116 జిల్లాల్లో 125 రోజుల ఉపాధి

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ నేపథ్యంలో వలస కూలీలు నగరాలు, పట్టణాల నుంచి సొంత గ్రామాలకు చేరుకున్నారని ప్రధాని మోదీ చెప్పారు. లాక్‌డౌన్‌ వల్ల పనులకు దూరమైన వలస కూలీలకు ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన ‘గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ యోజన’ను మోదీ శనివారం ప్రారంభించారు. రూ. 50వేల కోట్లతో ఆరు రాష్ట్రాల్లో ఈ పథకాన్ని, అమలు చేయనున్నారు.

కరోనాను అరికట్టే విషయంలో గ్రామీణ ప్రజల కృషి నగరాలకు పాఠాలు నేర్పిస్తోందని కొనియాడారు. నగరాలు వేగంగా అభివృద్ధి చెందడం వెనుక వలస కూలీల శ్రమ, నైపుణ్యం దాగి ఉందన్నారు. గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ యోజనతో ఇక గ్రామాలు ప్రగతి పథంలో పయనిస్తాయని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో వలస కూలీల సంక్షేమంపై నిత్యం ఆలోచించామని తెలిపారు. ఇప్పుడు సొంత గ్రామాల్లోనే వారికి పనులు లభిస్తుండడం సంతోషకరమని చెప్పారు.  

ఇంటర్నెట్‌ వేగం పెంచేందుకు చర్యలు  
దేశంలో మొట్టమొదటి సారిగా నగరాల కంటే గ్రామాల్లోనే ఇంటర్నెట్‌ అధికంగా వినియోగిస్తున్నారని ప్రధానమంత్రి తెలియజేశారు. గ్రామాల్లో ఇంటర్నెట్‌ వేగాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ యోజనతో పల్లెల్లో మౌలిక సదుపాయాలు పెరగడంతోపాటు ఇంటర్నెట్‌ లాంటి ఆధునిక వసతులు అందుబాటులోకి వస్తాయన్నారు. కూలీలకు ఉపాధి కల్పించే పథకానికి మోదీ బిహార్‌లోని కతిహార్‌ జిల్లాల్లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శ్రీకారం చుట్టారు.

125 రోజుల పాటు ఉపాధి  
గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ యోజన కింద ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, జార్ఖండ్, బిహార్‌ రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో వలస కూలీలకు రూ.50 వేల కోట్లతో 125 రోజులపాటు ఉపాధి కల్పిస్తామని కేంద్ర సర్కారు ప్రకటించింది. మొత్తం 25 రకాల పనులను కూలీలకు అప్పగిస్తామని వెల్లడించింది. పేదలకు గృహ నిర్మాణం, చెట్లు నాటడం, ప్రజలకు తాగునీటి వసతి కల్పించడం, పంచాయతీ భవనాల నిర్మాణం,  మార్కెట్లు, రోడ్ల నిర్మాణం వంటివి ఇందులో ఉన్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top