ఏప్రిల్ 14న లాక్‌డౌన్ ఎత్తివేసే ఆలోచన లేదు: మోదీ

PM Modi Says Lifting Of Lockdown Not Possible In All Party Meet Amid Covid 19 - Sakshi

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో ఏప్రిల్‌ 14న లాక్‌డౌన్‌ ఎత్తివేయడం సాధ్యం కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఒకేసారి లాక్‌డౌన్ ఎత్తివేయలేమని.. ఈ విషయంపై సలహాలు అన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటున్నామన్నారు. ఈ మేరకు.. త్వరలోనే ముఖ్యమంత్రులతో చర్చిస్తానని తెలిపారు. మానవాళి మనుగడకు సవాలుగా పరిణమించిన కరోనా వైరస్‌ కారణంగా దేశంలో నెలకొన్న పరిస్థితులను సమీక్షించేందుకు పార్లమెంటు ఫ్లోర్‌ లీడర్లతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మార్చి 24న విధించిన లాక్‌డౌన్‌ ఎత్తివేత గడువు సమీపించడం సహా దేశంలో నానాటికీ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో బుధవారం ఆయన ఈ మేరకు చర్చలు జరిపారు.(వైద్యుల భాషణకు ప్రజలు బెంబేలు)

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘ కోవిడ్‌-19 వ్యాపించిన తర్వాత పరిస్థితులు మునుపటిలా లేవు. ప్రీ కరోనా, పోస్ట్‌ కరోనా అన్నట్లుగా ఉంది. సామాజిక, వ్యక్తిగత ప్రవర్తనలో మార్పులు రావాల్సి ఉంది’’ అని పేర్కొన్నారు. కాగా ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ గులాం నబీ ఆజాద్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సుదీప్‌ బంధోపాధ్యాయ్‌, శివసేన నుంచి సంజయ్‌ రౌత్‌, బిజు జనతాదళ్‌ నుంచి పినాకీ మిశ్రా, బహుజన్‌ సమాజ్‌ పార్టీ నుంచి ఎస్‌సీ మిశ్రా, ఎన్సీపీ నుంచి శరద్‌ పవార్‌, సమాజ్‌వాదీ పార్టీ నుంచి రామ్‌ గోపాల్‌ యాదవ్‌, శిరోమణి అకాలీదళ్‌ నుంచి సుఖ్బీర్‌ సింగ్‌ బారల్‌, జనతాదళ్‌ నుంచి రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ సహా ఇతర పార్టీల ఎంపీలు పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న వైఎస్సార్‌ సీపీ ఎంపీలు
ప్రధాని మోదీ బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి, లోక్‌సభా పక్ష నేత మిథున్‌రెడ్డి పాల్గొన్నారు. (కరోనాతో దెబ్బతిన్న ఏపీని ఆదుకోండి : విజయసాయిరెడ్డి)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top