బాంబుల వర్షం కురిసేటప్పుడు మోదీ అక్కడే ఉన్నారా..!

PM Modi Observes Indian Air Force Attack On Jaish E Militants - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటామని అమర జవాన్ల సాక్షిగా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ తన మాట నిలబెట్టుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు సోమవారం అర్ధరాత్రి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోకి ప్రవేశించిన భారత వైమానిక దళానికి చెందిన  12 మిరాజ్‌-2000 జెట్‌ ఫైటర్స్‌ మెరుపుదాడి చేశాయి. భారత నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) వెంబడి ఉన్న జైషే ఉగ్రవాదుల స్థావరాలపై మంగళవారం తెల్లవారు జామున 3:30 గంటల ప్రాంతంలో సర్జికల్‌ స్ట్రైక్స్‌-2లో భాగంగా బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో సుమారు 300 మంది ఉగ్రవాదులు హతమైనట్టు సమాచారం.

ఇక ఈ దాడులను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పర్యవేక్షించినట్టు సమాచారం. జైషే ఉగ్రవాదుల స్థావరాలపై మన యుద్ధ విమానాలు బాంబులతో విరుచుకుపడుతున్నప్పుడు మోదీ కంట్రోల్‌ రూమ్‌లోనే ఉన్నట్టు తెలిసింది. భారత యుద్ద విమానాలు పని పూర్తి చేసుకుని సురక్షితంగా తిరిగి మన భూభాగంలోకి వచ్చిన తర్వాత ఆయన కంట్రోల్‌ రూమ్‌ నుంచి బయటికి వచ్చినట్టు ఓ అధికారి వెల్లడించారు. (సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు.. పరిస్థితి ఉద్రిక్తం)

ఇదిలాఉండగా.. పీఓకేలోని పాకిస్థాన్‌ ఉగ్రవాద శిబిరాలపై జరిపిన దాడి వివరాలను భారత్‌ అంతర్జాతీయ సమాజానికి వివరించింది. సర్జికల్‌ స్ట్రైక్స్‌-2 వివరాలను ఐక్యరాజ్య సమితి-భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, బ్రిటన్‌ ఫ్రాన్స్‌, రష్యా, చైనా దేశాలకు దాడి వివరాలను భారత్‌ తెలిపింది.ఫిబ్రవరి 14 జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. సర్జికల్‌ స్ట్రైక్స్‌- 2ను విజయవంతంగా పూర్తి చేసిన ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ పుల్వామా అమర జవాన్లకు ఘన నివాళులర్పించింది. (కార్గిల్‌ సమయంలో కూడా ఎల్‌వోసీ దాటని ఐఏఎఫ్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top