వెయ్యి మంది గాంధీలొచ్చినా! 

PM Modi comments about swacch bharat - Sakshi

     125 కోట్ల మంది మద్దతు లేకుండా స్వచ్ఛత సాధ్యం కాదు

     స్వచ్ఛ భారత్‌ మూడేళ్ల ప్రయాణం సందర్భంగా ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: స్వచ్ఛత, పరిశుభ్రత అంశాలను రాజకీయం చేయటం సరికాదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వెయ్యి మంది మహాత్మా గాంధీలొచ్చినా దేశాన్ని స్వచ్ఛంగా మార్చలేరని, 125 కోట్ల మంది భారతీయుల భాగస్వామ్యం లేకుండా ఈ కార్యక్రమ లక్ష్యాలను చేరుకోవటం సాధ్యం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ‘స్వచ్ఛ భారత్‌’కు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. చీపురు పట్టుకుని ఈ పథకాన్ని ప్రారంభించినపుడు తనను చాలా మంది విమర్శించారన్నారు. ‘మోదీని విమర్శించాలంటే చాలా అంశాలున్నా యి. కానీ సమాజంలో మార్పు తీసుకొచ్చే అంశాలపై హాస్యాస్పదంగా మాట్లాడటం, రాజ కీయం చేయటం సరికాదు. ఎవరెన్ని విమర్శలు చేసినా.. మహాత్ముడు చూపిన మార్గంలో ముందుకెళ్తాను’అని ప్రధాని పేర్కొన్నారు.

అక్టోబర్‌ 2 నాటి సెలవును వృథా చేస్తున్నా నంటూ కొందరు ప్రజలు, మరికొందరు తోటి రాజకీయ నాయకులు విమర్శించారన్నారు. ‘వెయ్యి మంది మహాత్మా గాంధీలు, లక్ష మంది నరేంద్ర మోదీలు, ముఖ్యమంత్రులు, అన్ని ప్రభుత్వాలు ఏకమైనా స్వచ్ఛ భారత్‌ లక్ష్యాలను చేరుకోవటం కష్టం. 125 కోట్ల మంది దేశ ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే అనుకున్నది సాధించగలం’ అని మోదీ వెల్లడించారు. తను చాలా విషయాల్లో ఓపికగా ఉంటానన్న మోదీ.. విమర్శలను సహించడంలోనూ తన సామర్థ్యా న్ని పెంచుకుంటున్నట్లు తెలిపారు.

‘ఐదేళ్ల క్రితం విద్యార్థులు స్కూళ్లు ఊడుస్తుంటే పెద్ద వివాదం చేశారు. తల్లిదండ్రులు కూడా టీచర్ల తీరును తప్పుబట్టారు. కానీ ఇప్పుడు ఆ విద్యార్థులే స్కూళ్లల్లో పారిశుధ్యం కోసం పనిచేస్తుండటాన్ని గొప్ప విషయంగా చూస్తున్నారు’ అని ఆయన తెలిపారు. మీడియా, పౌర సమాజం సభ్యులు స్వచ్ఛత ప్రాముఖ్యాన్ని ప్రచారం చేయటంలో కీలక భూమిక పోషించారన్నారు. స్వచ్ఛ భారత్‌ విషయంలో సాధించింది స్వల్పమేనని.. చేయాల్సింది చాలా ఉందని మోదీ అన్నారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top