‘దీదీ సిండికేట్‌ కనుసన్నల్లో బెంగాల్‌’

PM Modi Attacks West Bengals Syndicate Politics - Sakshi

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ ప్రజల ఆకాంక్షలను మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్‌ కాం‍గ్రెస్‌ ప్రభుత్వం విస్మరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. తృణమూల్‌ స్వార్ధపూరిత రాజకీయాలతో రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడుతోందని దుయ్యబట్టారు. పశ్చిమ మిడ్నపూర్‌లో సోమవారం కిసాన్‌ కళ్యాణ్‌ ర్యాలీని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. బెంగాల్‌లో రాజకీయ సిండికేట్‌ రాష్ట్రాన్ని దిగజార్చుతూ బెంగల్‌ ప్రతిష్టను మంటగలుపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

బెంగాల్‌లో వ్యాపారం చేయాలన్నా, ఉత్పత్తులు విక్రయించాలన్నా మమతా సిండికేట్‌ కనుసన్నల్లోనే జరగాలని అన్నారు. చివరికి కాలేజీల్లో అడ్మిషన్లకూ సిండికేట్‌ను సంతృప్తిపరచకుండా సాధించే పరిస్థితి లేదని మండిపడ్డారు. బెంగాల్‌ పంచాయితీ ఎన్నికల్లో చెలరేగిన హింసను ప్రస్తావిస్తూ ఇక్కడ ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేదనేందుకు ఇది సంకేతమన్నారు. రాజకీయ ప్రత్యర్ధులను ఇక్కడ సిండికేట్‌ హతమారుస్తోందని అన్నారు.

పశ్చిమ బెంగాల్‌కు కేంద్రం పంపే నిధులను సిండికేట్‌ అనుమతి లేకుండా ఖర్చు చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. త్రిపుర తరహాలో ఇక్కడ సైతం సిం‍డికేట్‌ను తరిమికొట్టేందుకు ప్రజలు చొరవ చూపాలని ప్రధాని పిలుపు ఇచ్చారు. 

కూలిన టెంట్‌ 15 మందికి గాయాలు
ప్రధాని కిసాన్‌ ర్యాలీలో ప్రసంగిస్తుండగా వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన టెంట్‌ కుప్పకూలడంతో 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను మోటార్‌ బైక్‌లు, ప్రధాని కాన్వాయ్‌లోని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని ఆస్పత్రిలో ప్రధాని పరామర్శించారు. ఉదయం నుంచి వర్షం పడుతుండటంతో పాటు కొందరు టెంట్‌కు ఊతంగా ఏర్పాటు చేసిన పోల్స్‌పైకి ఎక్కేందుకు కొందరు ప్రయత్నించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు.

ప్రధాని ప్రసంగించే సమయంలో ఈ ఘటన చోటుచేసుకోగా కొద్దిసేపు ఆయన తన ప్రసంగాన్ని నిలిపివేశారు. టెంట్‌పైకి ఎక్కిన వారంతా దిగిరావాలని, షామియానాలో కూర్చున్నవారు బయటకు రావాలని కోరారు. పరిగెత్తకుండా సంయమనంతో వ్యవహరించాలని కోరారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top