ఇలాగైతే చర్చలు రద్దు: పన్నీర్ సెల్వం

ఇలాగైతే చర్చలు రద్దు: పన్నీర్ సెల్వం - Sakshi


అన్నాడీఎంకేలోని రెండు వర్గాల విలీనం విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి వ్యవహరిస్తున్న తీరుపై మాజీ సీఎం పన్నీర్ సెల్వం వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. తమ డిమాండ్లు నెరవేర్చకుండా ఇలాగే మొండిగా వ్యవహరిస్తే ఇక విలీన చర్చలకు ఫుల్‌స్టాప్ పెట్టి ప్రజల్లోకి వెళ్లి తేల్చుకోవాలని పన్నీర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. విలీన చర్చల కోసం తాము నియమించిన ఏడుగురు సభ్యుల బృందాన్ని కూడా రద్దు చేయాలని యోచిస్తోంది. అన్నాడీఎంకేలో ఉన్న చీలిక వర్గాలు రెండూ కలిసిపోతే పార్టీకి మేలు జరుగుతుందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండాకుల గుర్తుమీద పోటీ చేయొచ్చని తలపెట్టిన అగ్రనేతలు.. విలీన చర్చలు మొదలుపెట్టారు. అయితే, పన్నీర్ సెల్వం వర్గం డిమాండ్లను పళనిస్వామి వర్గం, ఆయన మంత్రులు తేలిగ్గా తీసుకోవడం, వాటిని నెరవేర్చేందుకు ఏమాత్రం సుముఖత వ్యక్తం చేయకపోవడంతో పన్నీర్ వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. అసలు వాళ్లను తాము ఎలా నమ్మగలమని పన్నీర్ అంటున్నారు. ఒక పక్క చర్చలు జరుగుతుండగానే మరోవైపు వాళ్లు శశికళ, టీటీవీ దినకరన్‌ల పేర్లతో కూడిన ఒక అఫిడవిట్‌ను ఎన్నికల కమిషన్‌కు సమర్పించి, రెండాకులు గుర్తు కావాలంటున్నారని.. అసలు వాళ్లకు విలీనం కావాలని ఉందా లేదా అని ఆయన ప్రశ్నించారు.



మరోవైపు ముఖ్యమంత్రి ఈపీఎస్ మాత్రం తాము బేషరతు చర్చలకు సిద్ధంగానే ఉన్నామంటున్నారు. అయితే మెజారిటీ ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారు కాబట్టి.. రెండాకుల గుర్తు కూడా తమకే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శశికళ, దినకరన్‌లను తాము పక్కకు పెడతామని ఈపీఎస్ చెబుతున్నా.. వాళ్లను పూర్తిగా పార్టీ నుంచి బహిష్కరించాలని పన్నీర్ వర్గం డిమాండ్ చేస్తోంది. అలాగే మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం మీద సీబీఐ విచారణ జరిపించాలన్నది కూడా ఆ వర్గం ప్రధాన డిమాండ్లలో ఒకటి. కానీ ఇది కోర్టు పరిధిలో ఉందని సీఎం అంటున్నారు. దానికి తోడు మంత్రులు, ముఖ్యమంత్రి కూడా చర్చల సందర్భంగా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఇలాగైతే తాము ఎందుకు సహించి భరించాలని పన్నీర్ వర్గం అంటోంది. దాంతో.. ఇక చర్చలకు ఫుల్‌స్టాప్ పెట్టి, ఈనెల 5వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని, తద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ వర్గం బలాన్ని పెంచుకోవాలని పన్నీర్ సెల్వం భావిస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top