పుంజుకుంటున్న హస్తం | Opinion poll shows Congress' strategy rejig working; narrows gap with BJP | Sakshi
Sakshi News home page

పుంజుకుంటున్న హస్తం

Dec 7 2017 2:22 AM | Updated on Mar 29 2019 5:35 PM

Opinion poll shows Congress' strategy rejig working; narrows gap with BJP - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్‌ ఎన్నికల తొలిదశలో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోరు తప్పదని పరిస్థితులు చెబుతున్నాయి. ఇప్పటికే ఇరు పార్టీలు తమ వ్యూహాలను పకడ్బందీగా అమలుచేస్తున్నాయి. అయితే గుజరాత్‌లో కాంగ్రెస్‌ రోజురోజుకూ పుంజుకుంటోంది. యూపీ ఎన్నికల్లో విజయానికి బీజేపీ అనుసరించిన వ్యూహాన్నే గుజరాత్‌లో కాంగ్రెస్‌ అమల్లో పెట్టింది. సోషల్‌ ఇంజనీరింగ్‌ ఫార్ములానే ఫాలో అవుతోంది. అయితే నాలుగు నెలల్లో కాంగ్రెస్‌ జోరు పెరిగేందుకు నాలుగు ముఖ్య కారణాలున్నాయి.

మొదటిది, పార్టీపై ఉన్న హిందుత్వ వ్యతిరేక ముద్ర. దీన్ని తొలగించుకునేందుకు రాహుల్‌ గాంధీ దేవాలయాల సందర్శనకు ప్రాధాన్యమిస్తున్నారు. రెండోది, ఎన్నికల ప్రచారంలో బయటివారితో కాకుండా స్థానిక నేతలతోనే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. మూడోది, సాంప్రదాయ పద్ధతిలో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసేందుకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. నాలుగోది, రాహుల్, హార్దిక్‌ పటేల్‌ల విమర్శలకు ప్రధాని మోదీ నేరుగా స్పందించేలా చేయటం. ఇది బీజేపీని కాస్త ఇబ్బందిపెట్టే అంశమే.

అందుకే తెరపైకి ‘హిందుత్వ’?
గుజరాత్‌ ఎన్నికల్లో మోదీ, అమిత్‌ షాల జోడీకి విజయం నల్లేరుమీద నడకే అనే పరిస్థితులు మొదట్లో కనిపించాయి. కానీ ప్రచారం ముగింపునకు వస్తున్నకొద్దీ కాంగ్రెస్‌ జోరు పుంజుకుంటున్నట్లు స్పష్టమైంది. గుజరాత్‌లో గెలవటం మోదీ, అమిత్‌ షాలకు అత్యంత ప్రతిష్టాత్మకం. అందుకే కాంగ్రెస్‌ జోరు  నేపథ్యంలో దేశానికి ‘గుజరాత్‌ మోడల్‌’ను పరిచయం చేసిన మోదీ ప్రచార వ్యూహాన్ని మార్చారు. అభివృద్ధి అంశాన్ని పక్కనపెట్టి ‘హిందుత్వ’ అస్త్రాన్ని అందుకున్నారు. 2012 ఎన్నికల్లో ‘సబ్‌ కా సాత్‌.. సబ్‌ కా వికాస్‌’ నినాదంతో బీజేపీని విజయతీరాలకు చేర్చారు.

2014 సార్వత్రిక ఎన్నికల్లో ‘గుజరాత్‌ మోడల్‌’ను చూపించే మోదీ ఢిల్లీ గద్దెనెక్కారు. అయితే.. ఇప్పుడు ప్రధాన మంత్రి హోదాలో సొంత రాష్ట్రంలో ‘అభివృద్ధి’కి బదులు ఔరంగజేబు, అయోధ్య అంశాలను ప్రచారంలో లేవనెత్తుతున్నారు. ‘హిందుత్వకు బీజేపీ వంటి అసలైన ప్రతినిధి ఉండగా.. రెండోదానితో పనేంట’ని ఇటీవలే జైట్లీ కూడా వ్యాఖ్యానించారు. అయితే హిందుత్వ చాంపియన్‌ బీజేపీయే అయినప్పటికీ నిరుద్యోగ సమస్య, రిజర్వేషన్లపై ఆందోళనలు ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపనున్నాయనేది వాస్తవం. 

Advertisement
 
Advertisement
Advertisement