భార్యకు ఇష్టం లేకపోతే నేరమే!

Marriage Doesnt Mean Wife Always Ready For Sex  - Sakshi

మారిటల్‌ రేప్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ 

సాక్షి, న్యూఢిల్లీ : భార్యకు ఇష్టం లేకుండా బలవంతపు శృంగారానికి పాల్పడితే.. దానిని అత్యాచారంగా భావించవచ్చా? దేశవ్యాప్తంగా గత కొంత కాలం నుంచి విభిన్న వర్గాల మధ్య జరుగుతున్న చర్చ ఇది. ఈ నేపథ్యంలో మారిటల్‌ రేప్‌ (వైవాహిక అత్యాచారం)ను సమర్థిస్తూ..వ్యతిరేకిస్తూ దాఖలైన అభ్యర్థనల విచారిస్తున్న ఢిల్లీ హైకోర్టు.. ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్లి అనగానే భార్య ఎల్లవేళల భర్తతో శారీరక సంబంధానికి సిద్ధంగా ఉంటుందని అర్థం కాదని, వివాహం వంటి సంబంధాల్లో భార్యాభర్తలిద్దరికీ తమకు నచ్చనప్పుడు శారీకర సంబంధాలను నిరాకరించే హక్కు ఉంటుందని న్యాయస్థానం పేర్కొంది.

‘వివాహం అనగానే భార్య ఎల్లవేళలా సిద్ధంగా ఉండి.. భర్తతో సంబంధాలకు సమ్మతి తెలుపుతుందని అర్థం కాదు. భార్య సమ్మతితోనే భర్త ఈ సంబంధాన్ని కొనసాగించాల్సి ఉంటుంది’ అని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గీతా మిట్టల్‌, సీ హరిశంకర్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది.

భాగస్వామి లైంగిక హింస విషయంలో బలవంతపెట్టడం, భయపెట్టడం వంటి చర్యలను మాత్రమే నేరంగా పరిగణించాలని, అలాంటివి లేనప్పుడు దీనిని నేరంగా పరిగణించలేమని మారిటల్‌ రేప్‌ అంశాన్ని వ్యతిరేకిస్తున్న పురుషుల సంక్షేమ ట్రస్ట్‌ అనే ఎన్జీవో సంస్థ వాదించగా.. ఈ వాదనతో న్యాయస్థానం ఏకీభవించలేదు. లైంగిక దాడి కోసం బలవంతపెట్టారా? గాయాలయ్యాయా అని చూడాల్సి అవసరం ఇప్పుడు లేదని, రేప్‌ నిర్వచనం ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని ధర్మాసనం పేర్కొంది.

‘రేప్‌ కోసం బలవంతపెట్టడమనేది కచ్చితమైన షరతు ఏమీ కాదు. భార్యను ఆర్థిక ఇబ్బందులకు గురిచేసి.. శృంగారంలో  పాల్గొంటేనే గృహావసరాలు, పిల్లల ఖర్చుల కోసం  డబ్బులు ఇస్తానని భర్త ఒత్తిడి చేయవచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లో భార్య అందుకు ఒప్పుకున్నా.. ఆ తర్వాత ఆమె భర్తకు వ్యతిరేకంగా రేప్‌ కేసు పెట్టవచ్చు. అది జరిగే అవకాశముంది’ అని ధర్మాసనం పేర్కొంది. గృహహింస నిరోధక చట్టం, వివాహిత మహిళల వేధింపుల నిరోధక​ చట్టం, వేరుగా ఉంటున్న భార్యతో బలవంతపు శృంగారం నిరోధించే చట్టాలు ఇప్పటికే అమలులో ఉన్నాయని, ఈ నేపథ్యంలో భార్యతో శృంగారం నేరం కాబోదని పేర్కొంటున్న సెక్షన్‌ 375ను మార్చాల్సిన అవసరం ఏముందని మారిటల్‌ రేప్‌ను వ్యతిరేకిస్తున్న పిటిషనర్‌ వాదించగా.. ఇన్ని చట్టాల్లో పరిధిలో ఉన్నప్పుడు సెక్షన్‌ 375లో మాత్రం ఎందుకు మినహాయింపు ఇవ్వాలని ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top