ప్రేమ కోసమై పాక్‌ను వదిలి..

Man Came To Kurnool From Pakistan Over Love Affair - Sakshi

గడివేముల యువతిని ప్రేమించిన పాకిస్తానీ

మిస్డ్‌ కాల్‌ ద్వారా పరిచయం

ఆమె కోసం సౌదీ మీదుగా

నకిలీ గుర్తింపుతో రాక 

సాక్షి, హైదరాబాద్‌ : అతని పేరు షేక్‌ గుల్జార్‌ ఖాన్‌... పాకిస్తాన్‌కు చెందిన ఇతను దుబాయ్‌లో ఉండగా మిస్డ్‌కాల్‌ ద్వారా కర్నూలు జిల్లాకు చెందిన మహిళతో పరిచయం ఏర్పడింది. భర్తను కోల్పోయిన ఆమెతో గుల్జార్‌ ప్రేమలో పడ్డాడు. ఆమె కోసం సౌదీ మీదుగా నకిలీ గుర్తింపుతో భారత్‌కు వచ్చాడు. అనారోగ్యం పాలుకావడంతో మళ్లీ సొంత గడ్డపై మమకారం ఏర్పడటంతో కుటుంబంతో సహా అక్కడికి వెళ్లిపోవాలని భావించాడు. తన సోదరుడి సలహా మేరకు కర్తార్‌పూర్‌ కారిడార్‌ మార్గంలో వెళ్లాలని ప్రయతి్నంచాడు. హైదరాబాద్‌ చేరుకున్న అతడిని సీసీఎస్‌ అధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గుల్జార్‌ను కోర్టు అనుమతితో పోలీసు కస్టడీలోకి తీసుకునేందుకు సిట్‌ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. 

2004లో గడివేముల మహిళతో పరిచయం..
పాకిస్థాన్, పంజాబ్‌ ప్రావిన్స్‌లోని కుల్వాల్‌ ప్రాంతానికి చెందిన గుల్జార్‌ ఖాన్‌ ఆరి్థకంగా స్థితిమంతుడు. ఇతను 2004లో కొన్నాళ్ల పాటు దుబాయ్‌లో నివసించాడు. ఆ సమయంలో ఓ రోజు తనకు పొరపాటుగా వచి్చన మిస్డ్‌ కాల్‌కు స్పందించి కాల్‌ బ్యాక్‌ చేశాడు. ఈ కాల్‌ను కర్నూలు జిల్లా, గడివేములకు చెందిన దౌతల్‌బీ అందుకోవడంతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. వివాహిత అయిన దౌతల్‌ భర్త అంతకు కొద్ది రోజుల ముందే అనారోగ్యంతో మృతి చెందాడు. వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. దీంతో ఆమెను వివాహం చేసుకోవాలని భావించిన గుల్జార్‌ భారత్‌కు వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు.  

సౌదీ వెళ్లి హజ్‌ పేరు చెప్పి..
పాకిస్థాన్‌ నుంచి నేరుగా భారత్‌ చేరుకోవడానికి ఇబ్బందులు ఉంటాయని భావించిన గుల్జార్‌ 2008లో సౌదీ వెళ్లాడు. అక్కడ తన పాకిస్తానీ గుర్తింపులను ధ్వంసం చేసిన అతను భారత ఎంబసీని ఆశ్రయించాడు. తాను హరిద్వార్‌ నుంచి హజ్‌ యాత్రకు వచ్చానని, పాస్‌పోర్ట్‌ సహా డాక్యుమెంట్లు పోయాయని ఫిర్యాదు చేశాడు. గుల్జార్‌కు ఎమర్జెన్సీ సర్టిఫికెట్‌ (ఈసీ) జారీ చేసిన అధికారులు విమానంలో ముంబైకి పంపారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన అతను దౌతల్‌బీని వెతుక్కుంటూ కర్నూలు మీదుగా గడివేముల చేరుకున్నాడు. ఆమెను వివాహం చేసుకున్న గుల్జార్‌  పెయింటర్‌గా అక్కడే స్థిరపడ్డాడు. తాను భారతీయుడినే అంటూ ఆధార్‌కార్డు, ఓటర్‌ ఐడీ తదితరాలను పొందాడు. ప్రస్తుతం గుల్జార్‌–దౌతల్‌ దంపతులకు నలుగురు సంతానం.  

అనారోగ్యానికి గురికావడంతో.. 
ఇన్నేళ్లు భార్యపిల్లలతో కలిసి గడివేములలో నివసించిన గుల్జార్‌కు ఇటీవల టీబీ వ్యాధి సోకింది. దీంతో పెయిటింగ్‌ పని చేయలేకపోతున్న అతను తన స్వదేశానికి వెళ్లిపోవాలని భావించాడు. ఈ నేపథ్యంలో తనతో పాటు భార్య, పిల్లలకు విజయవాడ పాస్‌పోర్ట్‌ కార్యాలయం నుంచి పాస్‌పోర్టులు తీసుకున్నాడు. పాక్‌తో పాటు దుబాయ్‌లో ఉన్న తన కుటుంబీకులతో సంప్రదింపులు జరిపాడు. భారత్‌ నుంచి పాస్‌పోర్ట్, వీసాతో పాకిస్తాన్‌కు వచ్చి ఉండిపోవడం కష్టమని, దీనికంటే పంజాబ్‌లో ఏర్పాటైన కర్తార్‌పూర్‌ కారిడార్‌ మీదుగా అడ్డదారిలో రావాలని సోదరుడు షాజీద్‌ సలహా ఇచ్చాడు. దీంతో ఢిల్లీ మీదుగా కర్తార్‌పూర్‌ వెళ్లేందుకు గత బుధవారం కర్నూలు నుంచి రైలులో హైదరాబాద్‌ చేరుకున్నాడు. అప్పటికే  ఇతడి వ్యవహారాన్ని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి.  

సికింద్రాబాద్‌లో పట్టుకున్న సిట్‌..
ఈ విషయంపై కేంద్ర నిఘా వర్గాలు హైదరాబాద్‌ సిట్‌ పోలీసులకు సమాచారం అందించడంతో అప్రమత్తమైన  సిట్‌ ఏసీపీ బి.శ్రీనివాసరావు నేతృత్వంలో ఏఎస్సై ఎం.వెంకటేశ్వర్లు తదితరులతో కూడిన బృందం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ వద్ద కాపుకాసింది. అల్ఫా హోటల్‌ వద్ద వీరిని అదుపులోకి తీసుకున్న అధికారులు కుటుంబాన్ని విడిచిపెట్టి గుల్జార్‌ను అరెస్టు చేశారు. అతడి నుంచి భారత్‌లో తీసుకుని గుర్తింపుకార్డులు, పాస్‌పోర్ట్‌ స్వాదీనం చేసుకున్నారు. నిందితుడిపై ఐపీసీతో పాటు పాస్‌పోర్ట్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. గుల్జార్‌ వ్యవహారాన్ని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని సిటీ పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top