సబర్మతీ ఆశ్రమంలో.. సంప్రదాయ దుస్తుల్లో! | Sakshi
Sakshi News home page

Published Mon, Feb 19 2018 12:23 PM

Justin Trudeau along with his wife and children at Sabarmati Ashram - Sakshi

సాక్షి, అహ్మదాబాద్‌ : భారత పర్యటనలో ఉన్న కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో కుటుంబసభ్యులతో కలిసి సోమవారం సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. గుజరాతీ సంప్రదాయ దుస్తులు ధరించి భార్య సోఫీ, పిల్లలు జేవియర్‌, హడ్రియెన్‌, ఎల్లా గ్రేస్‌తో కలిసి ట్రూడో సబర్మతి ఆశ్రమాన్ని తిలకించారు. సబర్మతిలోని మహాత్మాగాంధీ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా ట్రూడో, ఆయన భార్య సోఫీ చరఖా తిప్పారు. అనంతరం గాంధీనగర్‌లోని అక్షర్‌ధామ్‌ ఆలయాన్ని దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ట్రూడో ఆదివారం ఉదయం తాజ్‌మహల్‌ను సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భార్య, పిల్లలతో కలిసి తాజ్ మహల్‌ ఎదురుగా సరదాగా ఫోటోలు దిగారు. భారత్‌లో ఏడు రోజుల అధికారిక పర్యటన కోసం ట్రూడో శనివారం ఢిల్లీకి వచ్చారు.

2012 తర్వాత భారత్‌లో పర్యటిస్తున్న కెనడా ప్రధాని ట్రూడోనే. ఈ నెల 23 వరకు ఆయన దేశంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. రక్షణ, ఉగ్రవాదం సహా పలు కీలకాంశాలపై ఇరువురు ప్రధానులు చర్చించనున్నారు. అనంతరం 20న ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ నిర్మాతలతో ముంబైలో సమావేశమవుతారు. 21న స్వర్ణదేవాలయాన్ని సందర్శించనున్నారు.

Advertisement
Advertisement