
పన్ను ఎగవేతదారుల జాబితాలో అంజన్న!
దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు ఆనందోత్సాహాలనడుమ జరుపుకొంటున్న తరుణంలో ఆ అంజన్న పట్ల కటువుగా వ్యవహరించి వార్తల్లో నిలిచిందో ప్రభుత్వ కార్యాలయం.
దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు ఆనందోత్సాహాలనడుమ జరుపుకొంటున్న తరుణంలో ఆ అంజన్న పట్ల కటువుగా వ్యవహరించి వార్తల్లో నిలిచిందో ప్రభుత్వ కార్యాలయం. అసలే పన్ను ఎగవేత చర్చనీయాంశమైన సందర్భంలో సాక్షాత్తు ఆంజనేయణ్నే పన్నుఎగవేతదారుడిగా ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..
బిహార్ లోని ఆరా మున్సిపాలిటీ అధికారులు అంజనీపుత్రుణ్ని టాక్స్ డిఫాల్టర్స్ లిస్ట్ లో పెట్టారు. భారీగా పన్ను బాకాయిపడ్డ వాళ్ల జాబితాను మున్సిపల్ ఆఫీసు నోటీస్ బోర్డులో ఉంచారు. అందులో వానరావతారం పేరుంది. ఆరాలోని ప్రముఖ హనుమాన్ ఆలయానికి ఆ పట్టణంలో పలు చోట్ల ఆస్తులున్నాయి. ఆయా ఆస్తులకు సంబంధించి పన్న కట్టాల్సి ఉండగా, ఏళ్లుగా ఆ పనిచేసినవారు లేరు. ఇటీవల ఆస్తిబకాయిలను రాబట్టుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసిన మున్సిపల్ అధికారులు ముందుగా పన్ను ఎగవేతదారుల జాబితాను ప్రకటించింది. హనుమంతుడు మొత్తం రూ. 4.33 లక్షల పన్ను ఎగవేశాడని జాబితాలో ఉంది. వెంటనే పన్ను చెల్లించకపోతే తర్వాతి చర్యగా పట్టణంలోని కూడళ్లవద్ద ఎగవేతదారుల జాబితా ప్రదర్శిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీనిపై హనుమాన్ టెంపుల్ ధర్మకర్తలు ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం.
కాగా, హనుమంతుడు ప్రభుత్వాధికారుల టర్గెట్ కావటం ఇది మొదటిసారేమీకాదు. గతంలో ఓ ఆలయ వివాదంపై కేసును విచారించిన బిహార్ స్థానిక కోర్టు.. విచారణకు హాజరుకావాలంటూ ఆంజనేయుడికి నోటీసులు జారీచేసింది. మరో కేసులో భగవంతుడికి షోకాజ్ నోటీసుల జారీ అయ్యాయి. ఇప్పుడు దేవుడిపేరు ఏకంగా పన్నుఎగవేతదారుల జాబితాలో చేరింది.