రాజీవ్ స్వగృహాలను అప్పగించండి: సుప్రీంకోర్టు | hand over the rajeev houses to Beneficiaries : supreme court | Sakshi
Sakshi News home page

రాజీవ్ స్వగృహాలను అప్పగించండి: సుప్రీంకోర్టు

Sep 17 2013 1:26 AM | Updated on Sep 2 2018 5:20 PM

న్యాయం కోసం నిరీక్షిస్తున్న ‘రాజీవ్ స్వగృహ’ లబ్ధిదారులకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. లబ్ధిదారులకు అపార్ట్‌మెంట్ ఫ్లాట్లు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టడం సరికాదని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ తీరును సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది.

సాక్షి, న్యూఢిల్లీ: న్యాయం కోసం నిరీక్షిస్తున్న ‘రాజీవ్ స్వగృహ’ లబ్ధిదారులకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. లబ్ధిదారులకు అపార్ట్‌మెంట్ ఫ్లాట్లు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టడం సరికాదని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ తీరును సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. నాలుగు వారాల్లోగా రిజిస్ట్రేషన్ ఖర్చులు భరించే లబ్ధిదారులకు ఫ్లాట్లను రిజిస్టర్ చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం స్పష్టమైన ఉత్తర్వులిచ్చింది. కేసు వివరాలివి... అల్పాదాయ, మధ్యాదాయ వర్గాలవారికి ఇళ్లు కట్టించి ఇవ్వాలని నిర్ణయించి 2007లో రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఫ్లాట్ల నిర్మాణం కోసం ఏపీ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థను నెలకొల్పింది.
 
 అయితే ఆ తర్వాత ఫ్లాట్ల ధరలను పెంచడంతో రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల సంక్షేమ సంఘం రాష్ట్ర హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. ధరల పెంపు నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. ఆ మేరకు లబ్ధిదారులు సొమ్ము చెల్లించినప్పటికీ వారికి ఫ్లాట్లను అప్పగించలేదు. దీంతో సంక్షేమ సంఘం హైకోర్టులో కోర్టు ధిక్కార వ్యాజ్యం దాఖలుచేసింది. దీంతో సృగృహ సంస్థ ప్రతినిధులు హాజరు కావాలని హైకోర్టు నోటీసులిచ్చింది. హైకోర్టు ఆదేశాల్ని సవాల్‌చేస్తూ రాజీవ్ స్వగృహ సంస్థ 2012 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. దాన్ని విచారించిన సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చింది. ఈ నేపథ్యంలో సుప్రీంలో పెండింగ్‌లో ఉన్న రాజీవ్ స్వగృహ సంస్థ ఎస్‌ఎల్‌పీ సోమవారం జస్టిస్ హెచ్.ఎల్.గోఖలే, జస్టిస్ జాస్తి చలమేశ్వర్‌తో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున అనిల్‌కుమార్ తాండేల్, ప్రతివాదుల తరఫున అనుమోలు వెంకటేశ్వరరావు, ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి వినిపించిన వాదనలు విన్నమీదట ధర్మాసనం వ్యాజ్యాన్ని పరిష్కరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement