breaking news
rajeev house scheme
-
ఈ-వేలం ద్వారా స్థలాల అమ్మకం
సీమాంధ్ర ఉద్యమంతో తీరు మార్చుకున్న స్వగృహ ఇప్పటికే విఫలమైన బహిరంగ వేలం ప్రక్రియ సాక్షి, హైదరాబాద్: నిధులు లేక అల్లాడుతున్న రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ తన ఖాళీ స్థలాలను ఈ-వేలం ద్వారా అమ్మేందుకు సిద్ధమైంది. గతంలోనే బహిరంగ వేలం ద్వారా స్థలాలు అమ్మేందుకు ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ సీమాంధ్రలో ఉద్యమం ఉధృతంగా సాగుతుండటంతో ఆ ప్రయత్నం విఫలమైంది. తుదిదశలో ఉన్న ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తిచేయాల్సిన అవసరం ఉండడం. అందుకు తగ్గట్టుగా నిధులు సమకూరకపోవడంతో ఇప్పటికిప్పుడు స్థలాలను అమ్మేందుకు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ తాజాగా ఈ-వేలం బాట పట్టింది. తొలిదఫాగా కాకినాడ, కర్నూలు, రాజంపేటలలోని ప్లాట్లకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. వీటితోపాటు తెలంగాణలోని కామారెడ్డిలో ఉన్న ఖాళీస్థలాన్ని అమ్మేందుకు కూడా నోటిఫికేషన్ ఇచ్చింది. ఇటీవల ప్రభుత్వం రూ.105 కోట్ల రుణాన్ని స్వగృహకు కేటాయించింది. వీటితో ఐదు ప్రాజెక్టుల్లోని ఇళ్లను పూర్తి చేయాలని నిర్ణయించారు. మిగతా వాటిల్లో పనులు పూర్తి చేసేందుకు కార్పొరేషనే సొంతంగా నిధులు సేకరించుకోవాల్సి ఉంది. ఇందుకోసం డిమాండ్‌లేని ప్రాజెక్టులు, డిమాండ్ ఉన్నవాటిల్లో ఖాళీగా ఉన్న భూములను అమ్మేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. గతంలో కాకినాడ, తణుకుల్లోని భూములను అమ్మేందుకు చేసిన ప్రయత్నాలు ఉద్యమం వల్ల విఫలం కావటంతో ఇప్పుడు ఈ-వేలం ద్వారా అమ్మాలనుకుంటున్నారు. కాకినాడలో తొలుత దాదాపు 5 ఎకరాల భూమిని 55 ప్లాట్లుగా, కర్నూలులో 10 ఎకరాల భూమిని 99 ప్లాట్లుగా, రాజంపేటలో 5 ఎకరాల భూమిని 60 ప్లాట్లుగా అభివృద్ధి చేశారు. వీటికి వచ్చే స్పందన ఆధారంగా మిగతా భూమిని, ఇతర ప్రాంతాల్లోని మరికొన్ని ప్లాట్లను ఈ-వేలం ద్వారా అమ్మేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కాకినాడ వేలం ఈ నెల 17వ తేదీన, రాజంపేటలో 18న, కర్నూలులో 19న నిర్వహించనున్నారు. అలాగే డిమాండ్ లేని ప్రాంతంగా ఇప్పటికే తేల్చిన నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో అందుబాటులో ఉన్న 8.30 ఎకరాలను ఈ నెల 18న ఏకమొత్తంగా అమ్మేందుకు నిర్ణయించారు. -
రాజీవ్ స్వగృహాలను అప్పగించండి: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయం కోసం నిరీక్షిస్తున్న ‘రాజీవ్ స్వగృహ’ లబ్ధిదారులకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. లబ్ధిదారులకు అపార్ట్మెంట్ ఫ్లాట్లు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టడం సరికాదని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ తీరును సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. నాలుగు వారాల్లోగా రిజిస్ట్రేషన్ ఖర్చులు భరించే లబ్ధిదారులకు ఫ్లాట్లను రిజిస్టర్ చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం స్పష్టమైన ఉత్తర్వులిచ్చింది. కేసు వివరాలివి... అల్పాదాయ, మధ్యాదాయ వర్గాలవారికి ఇళ్లు కట్టించి ఇవ్వాలని నిర్ణయించి 2007లో రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఫ్లాట్ల నిర్మాణం కోసం ఏపీ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థను నెలకొల్పింది. అయితే ఆ తర్వాత ఫ్లాట్ల ధరలను పెంచడంతో రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల సంక్షేమ సంఘం రాష్ట్ర హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. ధరల పెంపు నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. ఆ మేరకు లబ్ధిదారులు సొమ్ము చెల్లించినప్పటికీ వారికి ఫ్లాట్లను అప్పగించలేదు. దీంతో సంక్షేమ సంఘం హైకోర్టులో కోర్టు ధిక్కార వ్యాజ్యం దాఖలుచేసింది. దీంతో సృగృహ సంస్థ ప్రతినిధులు హాజరు కావాలని హైకోర్టు నోటీసులిచ్చింది. హైకోర్టు ఆదేశాల్ని సవాల్‌చేస్తూ రాజీవ్ స్వగృహ సంస్థ 2012 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. దాన్ని విచారించిన సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చింది. ఈ నేపథ్యంలో సుప్రీంలో పెండింగ్‌లో ఉన్న రాజీవ్ స్వగృహ సంస్థ ఎస్ఎల్పీ సోమవారం జస్టిస్ హెచ్.ఎల్.గోఖలే, జస్టిస్ జాస్తి చలమేశ్వర్‌తో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున అనిల్‌కుమార్ తాండేల్, ప్రతివాదుల తరఫున అనుమోలు వెంకటేశ్వరరావు, ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి వినిపించిన వాదనలు విన్నమీదట ధర్మాసనం వ్యాజ్యాన్ని పరిష్కరించింది.