మఫ్టీలో వచ్చి.. కానిస్టేబుల్‌ అనుచిత చర్య

Delhi Cop Allegedly Bullying Vegetable Sellers Amid Coronavirus Lockdown  - Sakshi

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్‌(కోవిడ్‌-19) వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు అవుతున్న వేళ పోలీసులు పటిష్ట చర్యలు చేపడతున్నారు. కరోనా సోకకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ... అదే విధంగా లాక్‌డౌన్‌ ఆవశ్యకతను వివరిస్తూ పలు వీడియోలు రూపొందిస్తున్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే దేశ రాజధానిలో ఓ పోలీసు కానిస్టేబుల్‌ ఇందుకు భిన్నంగా ప్రవర్తించారు. అకారణంగా కూరగాయల వ్యాపారులపై విరుచుకుపడ్డారు. మఫ్టీలో వచ్చి చేతిలో కర్ర పట్టుకుని అందరినీ బెదిరిస్తూ తోపుడు బండ్లపై ఉన్న కవర్లను తొలగించారు. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ కాయగూరలను నేలపై పడేశారు.(వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుందాం.. క్యాబేజీ, పాలకూర..)

ఈ ఘటన మధ్య ఢిల్లీలోని రంజిత్‌ నగర్‌లో బుధవారం జరిగింది. కానిస్టేబుల్‌ అనుచిత చర్యను గుర్తు తెలియని వ్యక్తులు వీడియో తీసి షేర్‌ చేయడంతో ప్రస్తుతం అది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో సదరు కానిస్టేబుల్‌ను రాజ్‌బీర్‌గా గుర్తించిన ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్‌ చేశారు. కాగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిత్యావసర సరుకులు ప్రజలకు అందుబాటులో ఉంచాలన్న విషయం కూడా సదరు కానిస్టేబుల్‌కు తెలియకపోవడం ఏంటని స్థానికులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కూరగాయల కోసం నానా ఇబ్బందులు పడుతున్నామని.. ఇలాంటి సమయంలో ఆయనలా ప్రవర్తించడం సిగ్గుచేటని మండిపడుతున్నారు. ఇక భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 700కు చేరుకోగా.. 16 మంది మరణించిన విషయం విదితమే. (‘ఊపిరి తిత్తులు ఇలాగే ఉక్కిరిబిక్కిరి అవుతాయి’)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top