సుప్రీంకు ‘సీబీఐ’ నివేదిక | Sakshi
Sakshi News home page

సుప్రీంకు ‘సీబీఐ’ నివేదిక

Published Tue, Nov 13 2018 3:50 AM

CVC submits probe report in sealed cover to Supreme Court - Sakshi

న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌కుమార్‌ వర్మ అవినీతి ఆరోపణల కేసుకు సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు నివేదికను సీల్డ్‌ కవర్‌లో సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) సోమవారం సుప్రీంకోర్టుకు సమర్పించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌తో కూడిన ఉన్నత ధర్మాసనం ఈ నివేదికను స్వీకరించి తదుపరి విచారణ నవంబర్‌ 16కు వాయిదా వేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి శనివారమే ప్రాథమిక దర్యాప్తు పూర్తయింది. కాగా, ఆదివారం రిజిస్టర్‌ కార్యాలయం తెరిచే ఉన్నా ఎందుకు నివేదించలేదని సీవీసీని ప్రశ్నిస్తూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

దీనికి సీవీసీ తరఫున కోర్టుకు హాజరైనా సొలిసిటర్‌ జనరల్‌ (ఎస్‌జీ) తుషార్‌ మెహతా కోర్టును క్షమాపణలు కోరుతూ.. నివేదిక తయారీ, స్పైరల్‌ బైండింగ్‌ వల్ల ఆలస్యమైందని, తాము కోర్టుకు వచ్చే వరకు సమయం మించిపోవడంతో రిజిస్ట్రర్‌ కార్యాలయం మూసేసి ఉందని వివరించారు. మరోవైపు కోర్టు ఆదేశాల మేరకు అక్టోబర్‌ 23 నుంచి 26 మధ్య తాను తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన నివేదికను సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌ ఎం.నాగేశ్వర్‌రావు సీల్డ్‌కవర్‌లో కోర్టుకు అందించారు. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానా అలోక్‌ వర్మపై చేసిన అవినీతి ఆరోపణల కేసుకు సంబంధించి జస్టిస్‌ పట్నాయక్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు చేయాలని గతనెల 26న సీవీసీని సుప్రీం ఆదేశించింది. మరోవైపు, సీబీఐ అధికారులు అస్థానా, వర్మ, నాగేశ్వర్‌రావ్‌కు వ్యతిరేకంగా ఎన్‌జీవో దాఖలు చేసిన కామన్‌కాజ్‌ అనే పిల్‌ను సుప్రీం కొట్టేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement