పసికూన కోసం సాహసం.. వైరల్‌!  

Constable Save Children In Maharashtra - Sakshi

ప్రశంసలందుకుంటున్న మహారాష్ట్ర కానిస్టేబుల్‌  

విపత్కర పరిస్థితులు ఎదురైనపుడు ఆందోళనకు గురైతే అది మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. అలా కాకుండా అప్రమత్తంగా ఉంటే విపత్తు నుంచి బయటపడే మార్గం లభిస్తుంది. ఇటీవల తాను ప్రయాణిస్తున్న రైలులో యువతులు ఏడుస్తుండడం గమనించిన ఆదర్శ్‌ శ్రీవాస్తవ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫికింగ్‌ బంధనంలో చిక్కుకుపోయిన 26 మందిని కాపాడారు.

అలాగే ఇలాంటిదే మరో ఘటనలో ఓ అపార్ట్‌మెంట్‌ కింది భాగం నీట మునిగి ఉండడం, అదే సమయంలో తమ బిడ్డ అనారోగ్యానికి లోనై తక్షణమే ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఏర్పడడంతో ఓ కుటుంబం పోలీస్‌ కంట్రోల్‌ రూంకు సమాచారమిచ్చింది. దీంతో ఓ కానిస్టేబుల్‌ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆ పసికూనను కాపాడాడు. దీనిపై హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 
        –సాక్షి, స్టూడెంట్‌ ఎడిషన్‌  
వర్షాకాలం ప్రారంభమవడంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వానలు కురుస్తున్నాయి. అరేబియా సముద్రతీరాన ఉన్న మహారాష్ట్రలోని పాల్ఘర్‌ను జిల్లాలోనూ కొద్దిరోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఎక్కడ చూసినా చిత్తడే. బయటికి వెళ్లలేని పరిస్థితి కొనసాగుతోంది. నగరంలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ఇబ్బందులకు గురైనవారితోపాటు ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్నవారు అటు మున్సిపల్‌ అధికారులతోపాటు పోలీసు విభాగానికి ఫోన్‌కాల్‌ చేసి తమ బాధలు చెప్పుకొంటున్నారు. సంబంధిత అధికారులు అందుకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటున్నారు. 

వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో శరద్‌ ఝా అనే వ్యక్తి ట్విటర్‌లో పోలీసులకు ఓ సందేశం పంపాడు. నగరంలోని మాణిక్‌పూర్‌ ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌ జలమయమైందని, ఆరు నెలల పసికూన అందులోనే ఉండిపోయిందని, అనారోగ్యానికి గురైనందువల్ల డాక్టర్‌ వద్దకు సత్వరమే తీసుకెళ్లాలని పేర్కొన్నాడు. పోలీస్‌ కంట్రోల్‌ రూం నుంచి ఈ సమాచారం అందుకున్న అనంత్‌ గీతే అక్కడికి చేరుకున్నాడు.

ఓ దుప్పటిలో పసికూనను ఉంచి రెండు చేతులూ పైకెత్తి మెల్లగా మూడో అంతస్తు నుంచి కిందికి దిగాడు, ఆ తర్వాత ఆ చిన్నారిని గట్టిగా పట్టుకుని మెల్లగా నీటి నుంచి మెయిన్‌ గేట్‌కు చేరుకుని బయటపడ్డాడు. అనంతరం ఆ పసికూనను సమీపంలోని ఆస్పత్రికి తక్షణమే తరలించారు. వైద్యసేవలు అందడంతో ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి మెరుగైంది.  

వర్క్‌ ఈజ్‌ వర్షిప్‌: గీతే  
‘నేను ఆ అపార్ట్‌మెంట్‌ వద్దకు చేరుకునే సమయానికి ప్రవేశద్వారం వద్ద నడుము లోతు మేర నీరు నిలిచిపోయి ఉంది. ఆ నీటిలోనే ముందుకు సాగా. మూడో అంతస్తుకు చేరుకున్నా. ఆ చిన్నారి కనుక ఒకవేళ నా బిడ్డ అయి ఉంటే ఎలాగైనా కాపాడుకునేవాడిని కదా అనిపించింది. దీంతో ఆ బిడ్డను కాపాడాను. నా ప్రాణాల గురించి ఆందోళన చెందలేదు’ అని అన్నాడు గీతే. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top