25 నుంచి దేశీయ విమానయానం

Civil aviation ecosystem fully prepared to resume domestic flight services - Sakshi

పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురీ ట్వీట్‌  

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ నేపథ్యంలో మార్చి 25వ తేదీ నుంచి రద్దయిన దేశీయ ప్రయాణికుల విమాన సర్వీసులు సరిగ్గా రెండునెలల తర్వాత పునఃప్రారంభం కానున్నాయి. ఈ నెల 25వ తేదీ(సోమవారం) నుంచి ఆయా సర్వీసులు మళ్లీ మొదలవుతాయని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్‌ చేశారు. కార్యకలాపాలు సాగించేందుకు సన్నద్ధం కావాలని అన్ని ఎయిర్‌పోర్టులకు, విమానయాన సంస్థలకు సమాచారం ఇచ్చామని తెలిపారు.(నేటి నుంచే రైల్వే బుకింగ్స్‌)

ప్రయాణికుల రాకపోకల విషయంలో పాటించాల్సిన విధివిధానాలను పౌర విమానయాన శాఖ జారీ చేస్తుందని వివరించారు. అయితే, అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయో మంత్రి ప్రకటించలేదు. దేశీయ విమాన సర్వీసులను ప్రారంభించాలన్న కేంద్ర సర్కారు నిర్ణయాన్ని స్పైస్‌జెట్‌ సంస్థ చైర్మన్, ఎండీ అజయ్‌సింగ్‌ స్వాగతించారు. దీనివల్ల ఆర్థిక రంగానికి ఊపు వస్తుందని అభిప్రాయపడ్డారు. విధివిధానాల కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు.(కొత్త కేసులు 5,611)

విమానయాన రంగంలో కరోనా కుదుపు
కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా కీలక రంగాలు దారుణంగా దెబ్బతిన్నాయి. విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం పడింది. భారత్‌లోనూ ఈ రంగం కుదేలైంది. చాలా సంస్థలు పైలట్లను విధుల నుంచి తొలగించాయి. సిబ్బంది జీతాల్లో కోత విధించాయి. కొన్ని సంస్థలు తమ ఉద్యోగులను సెలవుపై పంపాయి. సెలవు కాలంలో జీతాలిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాయి. ఇప్పుడు దేశీయ ప్రయాణికుల సర్వీసులను పునఃప్రారంభించడం వల్ల విమానయాన రంగం కొంత కుదుట పడేందుకు ఆస్కారం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top