రూ.30కే అపరిమిత చికెన్‌ మీల్స్‌

Chicken Meals Rs 30 To Dispel Coronavirus Rumours In Gorakhpur - Sakshi

కరోనా వైరస్‌ నేపథ్యంలో..

యూపీ పౌల్ట్రీ ఫామ్‌ అసోషియేషన్‌ వినూత్న ప్రచారం

లక్నో : కోవిడ్‌–19 (కరోనా వైరస్‌) దేశ వ్యాప్తంగా  పౌల్ట్రీ రంగాన్ని దారుణంగా దెబ్బతీస్తోంది. గత పక్షం రోజులుగా ఈ ప్రభావంతో పౌల్ట్రీ పరిశ్రమ భారీ నష్టాన్ని చవిచూసింది. కోవిడ్‌–19 వైరస్‌ చికెన్, గుడ్ల ద్వారా వ్యాప్తి చెందుతుందన్న అబద్ధపు ప్రచారం నేపథ్యంలో దేశంలో చికెన్, గుడ్ల వినియోగం దాదాపు 40 శాతం మేర పడిపోయినట్లు పౌల్ట్రీ ఫెడరేషన్‌ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరిగి పుంజుకునేందుకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన పౌల్ట్రీ ఫామ్‌ అసోషియేషన్‌ సభ్యులు వినూత్న ప్రయోగం చేశారు. చికెన్‌, ఫిష్‌ కారణంగా కరోనా వైరస్‌ సోకదని, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గోరఖ్‌పూర్‌లో ఆదివారం ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేవలం రూ. 30 రూపాయాలకే అపరిమిత చికెన్‌తో మీల్స్‌ను అందుబాటులో ఉంచారు. దీంతో పెద్ద ఎత్తున చికెన్‌ ప్రియులు అక్కడికి చేరుకుని.. లాగించారు. (సీఎంతో సహా మేమంతా తింటున్నాం)

దీనిపై పౌల్ట్రీ నిర్వహకులు మాట్లాడుతూ.. ‘కరోనా వైరస్‌ కారణంగా పౌల్ట్రీ పరిశ్రమ చాలా దెబ్బతిన్నంది. చికెన్‌, గుడ్లు, మటన్‌, ఫిష్‌ తినడం మూలంగా వైరస్‌ సోకుతుందని అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా అసత్యం. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చికెన్‌ మేళా కార్యక్రమాన్ని నిర్వహించాం. గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఈ ఫెస్ట్ పెట్టాం. కొద్దిసేపటికే భారీగా జనం క్యూ కట్టారు. దాదాపు మూడు గంటల పాటూ.. వచ్చే రోడ్లన్నీ బ్లాక్ అయ్యాయి. వెయ్యి కిలోలకు పైగా చికెన్ వండగా.. కొద్ది గంటల్లోనే మొత్తం ఖాళీ అయింద’ని చెప్పారు.

కోవిడ్‌–19కు చికెన్‌కు సంబంధం లేదు...
కోవిడ్‌–19 వైరస్‌కు చికెన్, గుడ్లతో ఎలాంటి సంబంధం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చైనాలో విభిన్న భౌగోళిక, వాతావరణ పరిస్థితులు, సగం ఉడికిన (హాఫ్‌ బాయిల్డ్‌) ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవడం తదితర కారణాలతో కోవిడ్‌ వైరస్‌ ఆ దేశంలో విజృంభిస్తోందన్నారు. మన దేశంలో ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలకుపైగా చేరుకోవడం, ఆహార పదార్థాలను సుమారు 100 సెంటిగ్రేడ్‌ వరకు ఉడికించి తింటుండటంతో ఎలాంటి వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలు లేవని స్పష్టం చేస్తున్నారు. కొందరు అదే పనిగా సోషల్‌ మీడియాలో చికెన్, గుడ్లతో ఈ వైరస్‌ సోకుతోందని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఇది ముమ్మాటికి తప్పుడు ప్రచారమేనని.. చికెన్, గుడ్ల వినియోగంతో వైరస్‌ వ్యాప్తి చెందదని సర్క్యులర్‌ను జారీ చేశాయని పౌల్ట్రీ ఫెడరేషన్‌ ప్రతినిధులు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top