భారత్‌లో బ్రిటన్ ప్రిన్స్ జంట | Britain Prince couple in India | Sakshi
Sakshi News home page

భారత్‌లో బ్రిటన్ ప్రిన్స్ జంట

Apr 11 2016 1:51 AM | Updated on Sep 3 2017 9:38 PM

భారత్‌లో బ్రిటన్ ప్రిన్స్ జంట

భారత్‌లో బ్రిటన్ ప్రిన్స్ జంట

బ్రిటన్ రాకుమారుడు విలియమ్, ఆయన సతీమణి కేట్ మిడిల్టన్ వారం రోజుల పర్యటన నిమిత్తం భారత్ చేరుకున్నారు.

♦ ముంబైలో 26/11 దాడుల మృతులకు విలియమ్, కేట్ నివాళి
♦ సచిన్‌తో కలసి క్రికెట్ ఆడిన విలియమ్ దంపతులు
♦ బాలీవుడ్, కార్పొరేట్ ప్రముఖులతో విందు.. నేడు ఢిల్లీకి పయనం
 
 ముంబై: బ్రిటన్ రాకుమారుడు విలియమ్, ఆయన సతీమణి కేట్ మిడిల్టన్ వారం రోజుల పర్యటన నిమిత్తం భారత్ చేరుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం ముంబైలో దిగిన అనంతరం నేరుగా తాజ్ ప్యాలెస్ హోటల్‌కు వెళ్లారు. అక్కడ 26/11 ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. విలియమ్ జంట భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. భారత్‌లో నాలుగు రోజుల పర్యటన తర్వాత భూటాన్‌కు వెళ్లనున్నారు. ఇరుదేశాల సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా ఈ పర్యటనను వినియోగించుకోవాలని బ్రిటన్ యువరాజు భావిస్తున్నారు.

 బ్యాట్ పట్టిన యువరాజు దంపతులు
 విలియమ్ దంపతులు తొలిరోజు ముంబైలో బిజీగా గడిపారు. తాజ్ హోటల్ నుంచి ఓవల్ మైదానానికి చేరుకున్న వీరు అక్కడ సరదాగా క్రికెట్ మ్యాచ్ ఆడి అందరినీ అలరించారు. పలు స్వచ్ఛంద సంస్థల చిన్నారులతోపాటు, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో కలసి క్రికెట్ ఆడారు. సచిన్ మొదటిబంతిని విలియమ్‌కు విసరగా, ఆ తర్వాత ఓ చిన్నారి బంతిని వేసింది. చిన్నారి రెండో బంతికి విలియమ్ ఔట్ కాగా, ఆ తర్వాత రాకుమారి కేట్ బ్యాట్ పట్టారు. సచిన్ అద్భుతమైన క్రికెటర్ అని, బ్యాటింగ్ ఎలా చేయాలో తనకు నేర్పారని విలియమ్ చెప్పారు. వీరితో కలసి ఆడటం మరిచిపోలేనని, ఇది తనకు మధుర స్మృతి అని సచిన్ పేర్కొన్నారు.

వారు ప్రపంచవ్యాప్తంగా చిన్నారులకు బాసటగా నిలుస్తూ తమ ఉదారతను చాటుతున్నారన్నారు. ముంబైకి చెందిన మూడు చారిటీ సంస్థలు మ్యాజిక్ బస్, డోర్‌స్టెప్, ఇండియాస్ చైల్డ్ లైన్ కోసం వారు క్రికెట్ ఆడారు. రాత్రి జరిగిన విందు కార్యక్రమంలో ఈ జంట పలువురు కార్పొరేట్, బాలీవుడ్ ప్రముఖులను కలుసుకున్నారు. ఫ్యాషన్ ఐకాన్‌గా పేరొందిన 34 ఏళ్ల కేట్.. అలెంగ్జాడర్ మెక్ క్వీన్ డిజైన్ చేసిన రెడ్‌ప్రింటెడ్ డ్రెస్‌ను ధరించి ముంబైలో అడుగుపెట్టారు. క్రికెట్ ఆడేటప్పుడు అనిత డోంగ్రే రూపొందించిన ప్రింటెడ్ ట్యూనిక్ డ్రెస్‌లో మెరిశారు.
 నేడు ఢిల్లీకి... విలియమ్ జంట సోమవారం ఢిల్లీకి వెళ్లనుంది. వీరు అక్కడ అమర సైనికులకు నివాళులర్పించిన అనంతరం, రాజ్‌ఘాట్‌కు వెళ్లి జాతిపిత మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పిస్తారు.  

 లెక్కలంటే భయం: విలియమ్
 విలియమ్ దంపతులు స్వచ్ఛంద సంస్థల చిన్నారులతో సందడిగా గడిపారు. వారితో కలసి క్రికెట్, ఫుట్‌బాల్ ఆడారు. అనంతరం వారితో కాసేపు ముచ్చటించారు. మీరేం చదువుతున్నారు, మీకు ఏ సబ్జెక్టులంటే ఇష్టం, మీ హాబీలు ఏంటి అని ఆప్యాయంగా పలకరించారు. మీరు కష్టపడి చదివితే మీ కలలను సాకారం చేసుకోవచ్చని 33 ఏళ్ల విలియమ్ చెప్పారు. ఒక చిన్నారి తనకు మ్యాథ్స్ సబ్జెక్టు అంటే ఇష్టమని, తాను టీచర్ కావాలని అనుకుంటున్నానని చెప్పగా, తనకు మాత్రం మ్యాథ్స్ అంటే భయమని విలియమ్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement