బీజేపీ తొలి జాబితా విడుదల

BJP releases first list of candidates for Gujarat polls  - Sakshi

జాబితాలో గుజరాత్‌ సీఎం, డిప్యూటీ సీఎం, పార్టీ అధ్యక్షుడి పేర్లు

ఐదుగురు కాంగ్రెస్‌ రెబెల్స్‌కు అవకాశం

న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరగనున్న గుజరాత్‌ ఎన్నికల కోసం 70 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో రాష్ట్ర సీఎం విజయ్‌ రూపానీ, ఉప ముఖ్యమంత్రి నితిన్‌ పటేల్, రాష్ట్ర బీజేపీ చీఫ్‌ జితూ వాఘానీలతో పాటు ఐదుగురు కాంగ్రెస్‌ రెబెల్‌ ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం 49 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు చోటు కల్పించారు. ముగ్గురు సిట్టింగ్‌లకు టికెట్‌ నిరాకరించారు. తొలి దశలో డిసెంబర్‌ తొమ్మిదిన∙గుజరాత్‌లోని 89 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి.  

16 మంది కొత్తవారికి అవకాశం
మొత్తం 70 మంది అభ్యర్థుల్లో పటేల్‌ వర్గానికి చెందిన 18 మంది, ఓబీసీలు 16 మంది, ఎస్సీలు ముగ్గురు, ఎస్టీలు 11 మంది ఉన్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఓబీసీల్లో ఠాకూర్‌ వర్గానికి ఎక్కువ స్థానాలు కేటాయించారు. ఆ తర్వాతి స్థానంలో కోలీ వర్గానికి చెందిన అభ్యర్థులున్నారు. జాబితాలో 16 మంది కొత్తవారికి బీజేపీ అవకాశమిచ్చింది. ప్రస్తుత కేబినెట్‌లోని 15 మంది మంత్రుల పేర్లు జాబితాలో ఉన్నాయి. రాజ్‌కోట్‌ పశ్చిమ నుంచి సీఎం రూపానీ, మెహసనా నుంచి ఉప ముఖ్యమంత్రి నితిన్, భావ్‌నగర్‌ పశ్చిమ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జితూ వాఘానీలను పోటీకి నిలిపారు. ఇటీవల ఐపీఎస్‌కు రాజీనామా చేసిన పీసీ బరాండాకు భిలోడా(ఎస్టీ) సీటు దక్కింది.

కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన రాఘవ్‌జీ పటేల్, ధర్మేంద్రసిన్హా జడేజా, రామ్‌సిన్హా పార్మర్, మన్‌సిన్హ్‌ చౌహాన్, సీకే రవోల్జీలకు తొలి జాబితాలో బీజేపీ అవకాశమిచ్చింది. రాష్ట్రపతి ఎన్నికలతో పాటు రాజ్యసభ ఎన్నికల్లోను వీరు బీజేపీకి మద్దతిచ్చారు. జాబితాలో నలుగురు మహిళలు ఉన్నారని, అన్ని కులాలు, వర్గాలకు సమ ప్రాధాన్యం కల్పించేందుకు ప్రయత్నించామని గుజరాత్‌ డిప్యూటీ సీఎం నితిన్‌æ చెప్పారు. బుధవారం సమావేశమైన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఈ జాబితాను ఖరారుచేసింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా నేతృత్వంలో జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో పాటు, ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top