ఎనిమిది రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లో కమలం వికసించింది. 12 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు ఏడింటిని గెలుచుకున్నాయి.
యూపీలో ఎస్పీకి, కర్ణాటకలో కాంగ్రెస్‌కు షాక్
న్యూఢిల్లీ: ఎనిమిది రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లో కమలం వికసించింది. 12 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు ఏడింటిని గెలుచుకున్నాయి. నాలుగింటిలో కమలం పార్టీ విజయం సాధించింది. మత అల్లర్లతో అట్టుడికిన యూపీలోని ముజఫర్‌నగర్ స్థానాన్ని సమాజ్‌వాదీనుంచి దక్కించుకుంది. కర్ణాటకలోని దేవదుర్గను కాంగ్రెస్ నుంచి తన ఖాతాలో వేసుకుంది. హెబ్బాళలోనూ విజయదుంధుబి మోగించింది. మైహర్(మధ్యప్రదేశ్)లో బీజేపీ తన పట్టు నిలుపుకుంది. బీజేపీ మిత్రపక్షాలైన శివసేన పాల్ఘర్(మహారాష్ట్ర)లో, హర్లకీ(బీహార్)లో ఆర్‌ఎఎస్పీ, ఖదూర్ షాహిబ్(పంజాబ్)లో అకాలీదళ్ పార్టీలు విజయం సాధించాయి. దేవ్‌బంద్(ఉత్తరప్రదేశ్), బీదర్(కర్ణా)ల్లో కాంగ్రెస్ గెలిచింది. యూపీలోని బికాపూర్‌లో ఎస్పీ గెలిచి పరువు నిలుపుకుంది. త్రిపురలోని అమర్‌పూర్‌లో సీపీఎం అభ్యర్థి భారీ మెజార్టీతో విజయం సాధించారు. తెలంగాణలోని నారాయణ్ ఖేడ్‌ను కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్ దక్కించుకుంది.
అభివృద్ధికి పట్టం.. ప్రధాని: పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ, భాగస్వామ్య పార్టీల విజయం ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టరనడానికి నిదర్శనమని ప్రధాని నరేంద్రమోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి ఈ విజయం చాలా ముఖ్యమైన దని అభిప్రాయపడ్డారు.