మహారాష్ట్ర ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య సీట్ల పంపిణీ విషయమై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించడానికి బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య సీట్ల పంపిణీ విషయమై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించడానికి బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగారు. సీట్ల విషయమై శివసేన చేస్తున్న ప్రతిపాదనలను పునరాలోచించుకోవాలని ఉద్ధవ్ ఠాక్రేను ఆయన కోరారు. దాదాపు 25 ఏళ్లుగా పొత్తులో ఉన్న ఈ రెండు పార్టీల మధ్య ఈసారి ఎన్నికలకు పోటీ చేసే విషయమై వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 15వ తేదీన జరగనున్నాయి. సోమవారం ఉదయం ఉద్ధవ్ను పిలిపించిన అమిత్ షా.. రెండు పార్టీల మధ్య బంధం తెగిపోకూడదని సూచించారు. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో తాము కనీసం 135 చోట్ల పోటీ చేస్తామని బీజేపీ అంటుండగా, శివసేన మాత్రం 119కి మించి ఇచ్చేది లేదని అంటోంది. ఈనెల 27తో నామినేషన్ల దాఖలు గడువు ముగిసిపోతుంది. త్వరలోనే అభ్యర్థుల జాబితా సిద్ధం చేస్తామని బీజేపీ వర్గాలు అంటున్నాయి. పొత్తు విషయమై తమ నిర్ణయం త్వరలోనే వెల్లడిస్తామని బీజేపీ అధికార ప్రతినిధి సయ్యద్ షానవాజ్ హుస్సేన్ తెలిపారు.