
సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో ఘర్షణలకు విపక్షాలే కారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు.
పట్నా : పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకిస్తున్న విపక్షాలపై కేంద్ర హోంమంత్రి, బీజేపీ నేత అమిత్ షా మండిపడ్డారు. సీఏఏను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సహా విపక్షాలు దేశంలో హింసను ప్రేరేపిస్తున్న క్రమంలో వారి ఆగడాలను అడ్డుకునేందుకు బీజేపీ దేశవ్యాప్తంగా ప్రజలకు పౌరచట్టంపై అవగాహన కల్పించేందుకు ర్యాలీలు చేపట్టవలసి వచ్చిందని చెప్పారు. ముస్లిం సోదరులు సీఏఏను పూర్తిగా చదవాలని చెప్పేందుకే తాను ఇక్కడకు వచ్చానని బిహార్‌లోని వైశాలిలో గురువారం జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ అమిత్ షా పేర్కొన్నారు. పౌరచట్టంపై ప్రజలను తప్పుదారి పట్టించవద్దని రాహుల్ గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్‌లను ఆయన కోరారు. మమతా దీదీ, కేజ్రీవాల్ కూడా ఈ చట్టంపై దుష్ర్పచారం మానుకోవాలని అమిత్ షా హితవు పలికారు. సీఏఏ పట్ల బిహార్ ప్రజలు సానుకూలంగా ప్రతిస్పందించారని చెప్పారు.