
అంబేడ్కర్ గొప్ప దార్శనికుడు
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆర్థిక ఆలోచనా సరళి, దార్శనికతను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయామని ప్రధాని మోదీ అన్నారు.
న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆర్థిక ఆలోచనా సరళి, దార్శనికతను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయామని ప్రధాని మోదీ అన్నారు. దేశాన్ని సుసంపన్నం చేసి, సమ్మిళిత అభివృద్ధిబాటలో నడపడంలో భాగంగా అంబేడ్కర్ ఆశయాలను నెరవేర్చడానికి కేంద్రం అన్ని విధాలా కృషిచేస్తోందని ప్రధాని పేర్కొన్నారు. అంబేడ్కర్ 125వ జయంతి వార్షికోత్సవాల్లో భాగంగా ప్రధాని తన నివాసంలో, బాబాసాహెబ్ స్మారకార్థం రూ.125, రూ.10 నాణేలను విడుదల చేశారు. ఆదివారం అంబేడ్కర్ 60వ వర్ధంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, అంబేడ్కర్ గొప్ప దార్శనికుడని కొనియాడారు.
అంబేడ్కర్ తన జీవితంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నప్పటికీ, ఆయన పనుల్లో దేశభక్తి కనిపిస్తుందని పేర్కొన్నారు. అంబేడ్కర్ వంటి మహనీయుల కారణంగానే భారత్ ఇప్పుడు ప్రగతిపథంలో ఉందన్నారు. భారత నాణేలపై అంబేడ్కర్ చిత్రాన్ని ముద్రించే రోజు వస్తుందని ఎవరూ ఊహించి ఉండరని మోదీ అన్నారు. ఇదిలా ఉండగా, ఉదయం పార్లమెంటు హౌస్ కాంప్లెక్స్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, స్పీకర్ సుమిత్రా మహాజన్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పలువురు మంత్రులు, ఎంపీలు అంబేడ్కర్‌కు నివాళులర్పించారు.