రాబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో వీవీపీఏటీ–ఈవీఎం వినియోగిస్తామని సుప్రీంకోర్టుకు ఈసీ తెలిపింది.
న్యూఢిల్లీ: సెప్టెంబర్‌కల్లా తయారీ సంస్థల నుంచి ఓటు రశీదు యంత్రాలు(వీవీపీఏటీ–ఈవీఎం) వస్తే రాబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో వాటిని వినియోగిస్తామని సుప్రీంకోర్టుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) వివరణ ఇచ్చింది. గుజరాత్ ఎన్నికల్లో 70,000 ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్(వీవీపీఏటీ) యూనిట్లు అవసరమవుతాయని, సెప్టెంబర్‌కల్లా 73,500 యూనిట్లు వస్తే ఎన్నికల్లో వాడతామని కోర్టుకు తెలిపింది.
వీటిలో భారత్ ఎలక్ట్రానిక్స్, ఈసీఐఎల్ నుంచి ఆగస్గు 31కల్లా 48వేల యూనిట్లు, సెప్టెంబర్ చివరికల్లా మరో 25,500 యూనిట్లు డెలివరీ రావాల్సి ఉందని తెలిపింది. ప్రస్తుతం ఈసీ వద్ద 53,500 యూనిట్లు ఉన్నాయి. గుజరాత్ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ లేదా ఈవీఎంలతోపాటు ఓటు రశీదు యంత్రాలనూ వినియోగించాలని ఈసీని ఆదేశించాలని కోరుతూ గుజరాత్ పటిదార్ నేత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా ఓటు రశీదుయంత్రాల వాడకంపై ఈసీని సుప్రీంకోర్టు వివరణ కోరిన సంగతి తెలిసిందే.