గోవా కోరుకునే మార్పు ‘ఆప్‌’! | AAP to change destiny of Goa, an analysis | Sakshi
Sakshi News home page

గోవా కోరుకునే మార్పు ‘ఆప్‌’!

Jan 28 2017 3:43 PM | Updated on Aug 14 2018 5:49 PM

గోవా కోరుకునే మార్పు ‘ఆప్‌’! - Sakshi

గోవా కోరుకునే మార్పు ‘ఆప్‌’!

‘గోవా మార్పును కోరుకుంటోంది. ఆ మార్పే ఆప్‌’ అంటూ గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ నాయకత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ముందుకు దూసుకెళుతోంది

పణజీ: ‘గోవా మార్పును కోరుకుంటోంది. ఆ మార్పే ఆప్‌’ అంటూ గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ నాయకత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ముందుకు దూసుకెళుతోంది. బీజేపీ, కాంగ్రెస్‌ లాంటి ప్రధాన పార్టీలతో పోటీ పడుతూ వీధి వీధిన పోస్టర్లను అతికించడంతోపాటు పెద్ద పెద్ద హోర్డింగ్‌లను కూడా ఏర్పాటు చేసింది. కొంకణి భాషలో ఎన్నికల పాటలను ప్రతి కూడలిలో వినిపిస్తోంది. గల్లీ గల్లీకి తిరగడమే కాకుండా ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారం సాగిస్తోంది. ఫోన్ల ద్వారా, సోషల్‌ మీడియా ద్వారా కూడా విస్తృత ప్రచారం సాగిస్తోంది. ప్రచార లోపం కారణంగా ఓడిపోరాదన్నది పార్టీ అభ్యర్థుల మాటల్లో, చేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

అధికారంలో ఉన్న ఢిల్లీ  నుంచే కాకుండా కర్ణాటకలోని బెంగళూరు నుంచి ఉత్తరాఖండ్‌ నుంచి ఆప్‌ కార్యకర్తలు వచ్చి గోవాలో ప్రచారం సాగిస్తున్నారు. ఆమెరికాలోని ఆప్‌శాఖ కార్యకర్తలు కొందరు గోవా వచ్చి ప్రత్యక్షంగా ప్రచారం చేస్తుండగా, ఎక్కువ మంది అక్కడి నుంచి గోవాలోని 3.8 లక్షల ఫోన్లకు ఫోన్‌చేసి ఆప్‌ తరఫున ప్రచారం సాగిస్తున్నారు. తాను బెంగళూరు నుంచి 500 మంది కార్యకర్తలతోని గోవా ప్రచారానికి వచ్చానని రమేశ్‌ అనే ఆప్‌ కార్యకర్త మీడియాకు తెలిపారు. తాము ఎక్కువగా కర్ణాటక నుంచి వలసవచ్చిన ప్రజల ఓట్లపై దృష్టిని కేంద్రీకరించి పనిచేస్తున్నామని ఆయన చెప్పారు.

గోవా సాంస్కృతిక వారసత్వ సంపదను పరిరక్షిస్తాం..
గోవాను సింగపూర్‌ నగరంగా మారుస్తామని, ఫ్రీవేలు, స్కైవేలు, క్యాసినోలు ఏర్పాటు చేస్తామంటూ ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రచారం చేస్తుండగా, గోవాకున్న ప్రత్యేక గుర్తింపును, సాంస్కృతిక వారసత్వపు సంపదను పరిరక్షిస్తామన్న నినాదంతో ఆప్‌ ఎన్నికల ప్రచారంలోకి దిగింది. బీజేపీ ఇప్పటికే ప్రవేశపెట్టిన ఉచిత ఆకర్షణ పథకాలను కొనసాగిస్తామని, నిరుద్యోగులకు నెలకు ఐదువేల రూపాయల భృతి కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలో మైనింగ్‌ కార్యకలాపాలను క్రమబద్దీకరిస్తామని చెప్పింది. ఇక ఆప్‌ తరఫున పోటీ పడుతున్న అభ్యర్థులు తమ తమ నియోజక వర్గాల్లో ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని హామీలు ఇస్తున్నారు. వారు ఇప్పటి వరకు 350కు పైగా ఎన్నికల ప్రచార సభలు నిర్వహించారు. అరవింద్‌ కేజ్రివాల్‌ ఎనిమిది బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించారు.

అందరూ కొత్తవారే...
రాష్ట్రంలోని 40 అసెంబ్లీ సీట్లకుగాను ఆప్‌ తరఫున 39 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎల్విస్‌ గోమ్స్‌ అనే క్రైస్తవుడు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో 27 శాతం క్రైస్తవుల ఓట్లు ఉన్నాయి. ఆప్‌ అభ్యర్థులందరూ రాజకీయాలకు కొత్తే. వారికి రాజకీయపరమైన ఎలాంటి అనుభవం లేదు. ఇదే అంశాన్ని అరవింద కేజ్రివాల్‌ ఎన్నికల ప్రచార సభల్లో, మీడియా ఇంటర్వ్యూలో పదే పదే ప్రస్తావిస్తున్నారు. రాజకీయ అనుభవం లేకపోయినా, అవినీతి చరితలేని వారినే తమ పార్టీ బరిలోకి దించిందని ఆయన చెబుతున్నారు. ఎన్నికయ్యాక తమ ఎమ్మెల్యేలు ఎలాంటి తప్పు చేసినా వారిని పార్టీ కఠినంగా శిక్షిస్తుందని ఆయన హామీ కూడా ఇస్తున్నారు. కాంగ్రెస్‌ కాకపోతే బీజేపీ, బీజేపీ కాకపోతే కాంగ్రెస్‌ను ఎన్నికునే సంస్కృతిని ఇకనైనా వదులుకోవాలని, గోవా సంస్కృతి పరిరక్షణకు ఆప్‌ను గెలిపించాలని ఆయన కోరుతున్నారు. పాలక పక్ష బీజేపీ తరఫున 36 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌ పార్టీ తరఫున 37 మంది పోటీ చేస్తున్నారు. ఇక మహారాష్ట్రావాది గోమంతక్‌ పార్టీ, గోవా సురక్షా మంచ్, శివసేన కూటమి 35 సీట్లకు పోటీ చేస్తోంది.

ఏ పార్టీ గెలుస్తుంది?
గోవా ఎన్నికల బరిలోకి తొలిసారిగా ఆప్‌ దిగడం వల్ల కాంగ్రెస్‌ ఓట్లు చీలిపోయి తమకు లబ్ధి చేకూరుతోందని తామే విజయం సాధిస్తామని అధికార పార్టీ బీజేపీ వాదిస్తోంది. కొన్ని సర్వేలు కూడా ఆ పార్టీ వాదనతో ఏకీభవించాయి. ఇప్పుడు బీజేపీ, గతంలో కాంగ్రెస్‌తో విసిగిపోయిన గోవా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, మొదట్లో రెండు సీట్లు కూడా రావన్నవారే ఖాయంగా 12 సీట్లు వస్తాయని ఇప్పుడు చెబుతున్నారని, దీనర్థం తమ గెలుపు ఖాయమని ఆప్‌ వర్గాలు చెబుతున్నాయి. అండర్‌ కరెంట్‌గా ఆప్‌కు రోజురోజుకు మద్దతు పెరుగుతోందని, ఈ కారణంగా ఆప్‌ గెలిచే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2015లో ఢిల్లీ ఆప్‌ సృష్టించిన చరిత్ర గోవాలో పునరావృతం అవుతుందేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement