మార్చి 31 తరువాత కూడా!

Aadhaar Not Necessary For Bank Accounts, Phones For Now: Supreme Court - Sakshi

ఆధార్‌ అనుసంధాన గడువును పొడిగించిన సుప్రీంకోర్టు

బ్యాంకు ఖాతాలు, మొబైల్‌ నంబర్లకు అమలు

రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు వచ్చే వరకు వెసులుబాటు

న్యూఢిల్లీ: ఆధార్‌ అనుసంధానం తలనొప్పి ప్రస్తుతానికి తొలగింది. వివిధ సేవలకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్‌ అనుసంధాన గడువైన మార్చి 31వ తేదీ దగ్గరికొస్తుండటంపై ఆందోళన చెందుతున్నవారు ఊపిరి పీల్చుకోవచ్చు. బ్యాంకు ఖాతాలు, మొబైల్‌ నంబర్లు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్‌ను అనుసంధానించుకునే గడువును సుప్రీంకోర్టు పొడిగించింది.

ఆధార్‌ చట్టబద్ధతను నిర్ధారించేందుకు ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు ఇచ్చేవరకు, ఈ గడువు కొనసాగుతుందని స్పష్టం చేసింది. అంటే, మార్చి 31 తరువాత కూడా, రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు వెలువడే వరకు, ఆధార్‌ అనుసంధాన ప్రక్రియను పౌరులు, వినియోగదారులు కొనసాగించుకోవచ్చు. అయితే సంఘటిత నిధి నుంచి నిధులందే ఉపాధి హామీ, ఆహార భద్రత తదితర సంక్షేమ పథకాల లబ్ధిదారుల నుంచి ప్రభుత్వం ఆధార్‌ సంఖ్యను మార్చి 31 తరువాత కూడా యథావిధిగా కోరవచ్చని  స్పష్టతనిచ్చింది.

తత్కాల్‌ పాస్‌పోర్ట్‌కూ అవసరం లేదు
వివిధ సేవలు, సంక్షేమ పథకాలతో ఆధార్‌ అనుసంధానానికి ఇచ్చిన మార్చి 31 గడువుని పొడిగించేందుకు సిద్ధమని కేంద్రం ఇదివరకే కోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం తాజా ఉత్తర్వులు జారీ చేసింది.

‘ ఆధార్‌ చట్టబద్ధతపై ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనం విచారణ పూర్తి చేసి, తుది తీర్పు వెలువరించే వరకు.. ఆధార్‌ అనుసంధానానికి సంబంధించి గతంలో ఇచ్చిన మార్చి 31 గడువును నిరవధికంగా పొడిగించాలని ఆదేశిస్తున్నాం’ అని బెంచ్‌ పేర్కొంది. అలాగే, తత్కాల్‌ పాస్‌పోర్ట్‌ పొందడానికి ఆధార్‌ తప్పనిసరి కాదని కూడా తేల్చి చెప్పింది.

మంగళవారం జరిగిన విచారణలో అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్, సీనియర్‌ న్యాయవాదులు పి.చిదంబరం, కేవీ విశ్వనాథన్‌ పాల్గొన్నారు. ఆధార్‌ చట్టబద్ధత, దానికి సంబంధించిన చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను ప్రత్యేకంగా రాజ్యాంగ ధర్మాసనం చేపట్టిన సంగతి తెలిసిందే.

సబ్సిడీల పంపిణీలో అవాంతరాలు వద్దు
ఆధార్‌ అనుసంధానానికి గడువు పొడిగించడం వల్ల ఆ చట్టంలోని సెక్షన్‌ 7 పరిధిలోకి వచ్చే సబ్సిడీలు, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు కల్పించడంలో అవాంతరాలు ఏర్పడకుండా చూడాలని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఆధార్‌ చట్టంలోని నిబంధన 7 ప్రకారం.. లబ్ధిదారుడి గుర్తింపును ధ్రువీకరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆధార్‌ వివరాలు కోరొచ్చు.

ఆధార్‌ పొందని వారు కూడా ఆ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నామని నిరూపించగలిగితే ప్రభుత్వ ప్రయోజనాలు పొందొచ్చు. అలాంటి వారి గుర్తింపును నిర్ధారించడానికి ప్రత్యామ్నాయ మార్గాలు కల్పిస్తారు. ఆధార్‌ చట్టబద్ధతను సవాల్‌ చేసిన పిటిషనర్లలో ఒకరైన మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేశ్‌ తరఫున హాజరైన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు పి.చిదంబరం వాదిస్తూ.. ఆధార్‌ బిల్లును లోక్‌సభ స్పీకర్‌ తప్పుగా మనీ బిల్లుగా పేర్కొని, అది రాజ్యసభకు రాకుండా అడ్డుకున్నారని అన్నారు.

ఆధార్‌ తప్పనిసరే: యూఐడీఏఐ
బ్యాంకు ఖాతాలు, తత్కాల్‌ పాస్‌పోర్టులకు ఆధార్‌ తప్పనిసరియేనని ఆధార్‌ ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) స్పష్టం చేసింది. అయితే ఆధార్‌ ఇంకా పొందని వారు, దానికి దరఖాస్తు చేసుకుని అప్లికేషన్‌ సంఖ్యతో ఆ సేవలు పొందొచ్చని పేర్కొంది. ‘సంబంధిత చట్టాల ప్రకారం బ్యాంకు ఖాతాలు, తత్కాల్‌ పాస్‌పోర్టులకు ఆధార్‌ తప్పనిసరి అని చెబుతున్న నిబంధన కొనసాగుతుంది’ అని యూఐడీఏఐ తెలిపింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top