తెలుగు రాష్ట్రాల్లోని 228 సెన్సస్ పట్టణాలను చట్టబద్ధమైన అర్బన్ స్థానిక సంస్థలుగా మార్చేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలను కోరింది.
తెలుగు రాష్ట్రాలకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లోని 228 సెన్సస్ పట్టణాలను చట్టబద్ధమైన అర్బన్ స్థానిక సంస్థలుగా మార్చేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలను కోరింది. దీంతోపాటు దేశంలోని అన్ని సెన్సస్ పట్టణాలను చట్టబద్ధమైన అర్బన్ స్థానిక సంస్థలుగా మార్చాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా మంగళవారం లేఖలు రాశారు. ఒక ప్రాంతాన్ని సెన్సస్ పట్టణంగా పరిగణించాలంటే..5 వేలమంది కనీస జనాభాతో చదరపు కిలోమీటర్‌కు 400 మంది జనాభా సాంద్రతను కలిగివుండాలని లేఖలో పేర్కొంది. కనీసం 75% పురుషులు వ్యవసాయేతర పనులు చేస్తూ పట్టణ లక్షణాలు కలిగివుండాలని స్పష్టం చేశారు. మున్సిపాలిటీ, కార్పొరేషన్, కంటోన్మెంట్ బోర్డులను చట్టబద్ధమైన పట్టణాలుగా పరిగణిస్తారు.
సెన్సస్ పట్టణాలను చట్టబద్ధమైన అర్బన్ స్థానిక సంస్థలుగా మార్చడం వల్ల వాటికి 14 వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర సాయం లభిస్తుందన్నారు. అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (అమృత్) పథకం కింద రాష్ట్రంలో చట్టబద్ధమైన పట్టణాల సంఖ్య ఆధారంగా 50% వెయిటేజ్ ఇస్తారని తెలిపారు. ప్రణాళిక, సమన్వయ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆదాయ పెరుగుదలతో పాటు పౌరులకు సమర్థవంతంగా సేవలను అందించడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలు పెరగడానికి చట్టబద్ధమైన అర్బన్ స్థానిక సంస్థలు దోహదపడతాయని వివరించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 3,784 సెన్సస్ పట్టణాలున్నాయని లేఖలో పేర్కొంది.