24 గంటల్లో 19,459 కేసులు.. 380 మరణాలు  | 19459 Corona Positive Cases Registered Within One Day In India | Sakshi
Sakshi News home page

24 గంటల్లో 19,459 కేసులు.. 380 మరణాలు 

Jun 30 2020 4:48 AM | Updated on Jun 30 2020 4:48 AM

19459 Corona Positive Cases Registered Within One Day In India - Sakshi

చెన్నైలో ఓ బాలుడి శరీర ఉష్ణోగ్రతను చెక్‌ చేస్తున్న వైద్యుడు   

న్యూఢిల్లీ: భారత్‌లో వరుసగా ఆరో రోజు 15 వేలకుపైగా కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. ఆదివారం నుంచి సోమవారం వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 19,459 కేసులు నమోదయ్యాయి. ఇలాగే 380 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం కేసులు 5,48,318కి, మరణాలు 16,475కు చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసులు 2,10,120 కాగా, 3,21,722 మంది బాధితులు చికిత్సతో కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రికవరీ రేటు 58.67 శాతానికి చేరింది. 24 గంటల్లో దేశవ్యాప్తంగా 12,010 మంది కోలుకున్నారు. జూన్‌ 1 నుంచి 29వ తేదీ వరకు ఇండియాలో 3,57,783 కరోనా కేసులు నమోదయ్యాయి. భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) గణాంకాల ప్రకారం.. దేశంలో ఇప్పటిదాకా 83,98,362 కరోనా టెస్టులు నిర్వహించారు. ఆదివారం 1,70,560 టెస్టులు జరిగాయి.

దేశంలో తొలి ప్లాస్మా బ్యాంక్‌ ఢిల్లీలో
దేశంలోనే ప్రప్రథమ ప్లాస్మా బ్యాంకును ఢిల్లీలో ప్రారంభిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్‌ ప్రకటించారు. రానున్న రెండు రోజుల్లో అది తన కార్యకలాపాలను ప్రారంభిస్తుందని పేర్కొన్నారు. కోవిడ్‌ సోకి చివరి దశల్లో ఉన్న వారికి కోవిడ్‌ నుంచి కోలుకున్న వారి ప్లాస్మా ఇవ్వడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తున్న నేపథ్యంలో ఈ ప్లాస్మా బ్యాంకును ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. కోవిడ్‌ నుంచి కోలుకున్న వారు తమంతట తాముగా వచ్చి ప్లాస్మాను దానం చేయడం ద్వారా ప్రాణదానం చేసినవారవుతారని పిలుపునిచ్చారు. ప్లాస్మా బ్యాంకు నుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు ప్లాస్మాను తీసుకోవచ్చిన చెప్పారు. ప్లాస్మా దాతల కోసం తామే రవాణా ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. కోవిడ్‌ బారిన పడిన ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్‌ జైన్‌ కూడా ప్లాస్మా థెరపీ ద్వారా కోలుకున్నారని చెప్పారు. ఢిల్లీలో కోవిడ్‌ రోగుల కోసం బెడ్ల కొరత లేదని తెలిపారు. ప్రస్తుతం 13,500 బెడ్లు ఉండగా, కేవలం 6,000 బెడ్లలో మాత్రమే రోగులు ఉన్నారని చెప్పారు.

జూలై 31 వరకు మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ 
రాష్ట్రంలో కరోనా కేసులు విజృంభిస్తుండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ని మరో నెల రోజుల పాటు పొడిగించింది. లాక్‌డౌన్‌ ఈనెల30న ముగుస్తోండడంతో జూలై 31 వరకు లాక్‌డౌన్‌ని పొడిగిస్తున్నట్టు చీఫ్‌ సెక్రటరి కార్యదర్శి అజయ్‌ మెహతా ప్రకటించారు. ఫేస్‌ కవర్లు, మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం, ప్రజలు ఒక చోట గుమిగూడడంపై నిషేధం కొనసాగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement