ప్రముఖ రచయిత దేవరాజు రవి కన్నుమూత

Writer Deavaraju Ravi Passes Away - Sakshi

ప్రముఖ కథకుడు, నవలాకారుడు, సినిమా సమీక్షకుడు అన్నిటికి మించి సాంఘిక సేవాకార్యకర్త శ్రీ దేవరాజు రవి మార్చి 2వతేదీ ఉదయం 7 గంటలకు హైదరాబాద్ మేడిపల్లిలో కన్నుమూశారు. దేవరాజు రవి 12 నవలలు, 200 పైగా కధలు, 1250 సినిమా సమీక్షలు ఇంకా పలు ఇతర వ్యాసాలూ రాశారు. 1959 లో ‘రామం’ అనే నవలతో ప్రారంభమైన ఆయన రచనా వ్యాసంగం చివరిరోజు వరకు కొనసాగింది.

మూడు కవితా సంపుటాలు, రెండు కథా సంపుటాలు వెలువరించారు. సితార, శివరంజని, మేఘసందేశం, నంబర్ వన్ సినిమా పత్రికలలో ఆయన చేసిన సమీక్షలు విశేషంగా పాఠకుల్ని ఆకట్టుకోడమేకాక నిష్పక్షపాత సమీక్షలు కావడంతో సినీ వర్గాల ప్రశంసల్ని పొందాయి. ఆయన రచనల్ని సర్వేపల్లి రాధాకృష్ణన్, వి.వి. గిరి వంటి ప్రముఖులు మెచ్చుకున్నారు. ఆయన నంది అవార్డుల కమిటీలో రెండుసార్లు సభ్యులుగా పనిచేశారు.

తెలుగులో తొలి డిటెక్టివ్ నవల ‘వాడే వీడు’ రచయితైన దేవరాజు వెంకట కృష్ణారావు వీరి తండ్రే. వీరి స్వస్థలం బరంపురం. దేవరాజు రవి సుప్రసిద్ధ సాంఘిక కార్యకర్త. కుష్టువ్యాధి నిర్మూలనకు విశేషంగా కృషిచేశారు. ఎంతోమంది రోగులకు స్వయంగా సేవ చేశారు. లెప్రసీ డాక్టర్ గా ఏరికోరి ఉద్యోగం చేసి, పదవి విరమణ అనంతరం సైతం ఆ సేవల్ని కొనసాగించారు. రేపు హైదరాబాద్ లో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top