కుళ్లు రాజకీయాలు చేశారు: రాజేంద్రప్రసాద్

కుళ్లు రాజకీయాలు చేశారు: రాజేంద్రప్రసాద్


మా అధ్యక్ష పదవికి పోటీపడిన తనను భయపెట్టారని, కుళ్లు రాజకీయాలు, కుట్రలు చేశారని కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన రాజేంద్రప్రసాద్ అన్నారు. ఎన్నికను అధికారికంగా ప్రకటించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మురళీమోహన్ వర్గంపై పరోక్షంగా నిప్పులు చెరిగారు. తనను అభిమన్యుడిలా అంతం చేద్దామనుకున్నారని, కానీ తాను నటకిరీటిని కాబట్టి అర్జునుడిలా విజయం సాధించానని ఆయన అన్నారు. అలాగే తాము పంచపాండవుల్లా ఐదుగురిమే బరిలోకి దిగామని, వాళ్లు మాత్రం కౌరవుల్లా వచ్చారని ఎద్దేవా చేశారు. ఆయన ఏమన్నారంటే..''నటరాజు కొత్త బాధ్యతలను అందించారు. ఇది మామూలుగా జరిగిందా అంటే.. ఎలా జరిగిందని మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు. గత 15-20 రోజుల నుంచి ఏం జరిగిందో అంతా మీడియాలో వస్తూనే ఉంది. రెండు రాష్ట్రాలకు చెందిన తెలుగువారంతా ఈ ఎన్నికల గురించి ఏమైందోనని ఆసక్తిగా ఎదురుచూశారు. ఇది కేవలం సేవా కార్యక్రమం. కళాకారులకు సేవ చేయడానికి వచ్చాం. ఇక్కడి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకెళ్లడానికి రాలేదు. నాకు కనీసం టీ కూడా ఇవ్వద్దు. ఎందుకంటే.. ఇక్కడకు ఒక కమిట్మెంట్తో నేను, కాదంబరి కిరణ్, శివాజీరాజా, ఏడిద శ్రీరాం గుడిలో ఒట్టేసి మరీ వచ్చాం. మమ్మల్ని భయపెట్టారు, ప్రలోభపెట్టారు, కుళ్లు, కుత్సిత రాజకీయాలు చేశారు. నేను వాటికి పనికిరాను, అవేంటో నాకు తెలీదు. ఎన్ని పరీక్షలు దాటుకుని ఇక్కడకు వచ్చామో మీకే తెలుసు. మేం ఒంటరిగా పోరాటం చేశాం.. ఇది ధర్మయుద్ధం. పిరికివాడుంటే రాజు ముందుకు వెళ్లలేడంటూ నా వెనకున్న ఏకైక వ్యక్తి.. నాగబాబు. రాజా.. ముందుకెళ్లు అన్నారు. నామీద మీకున్న ప్రేమతో పాటు.. నా ప్రాణాన్ని పణంగా పెట్టి నేనన్న ప్రతి మాటను నెరవేరుస్తా. ఏమాటా మర్చిపోయే అవకాశమే లేదు. విజయచందర్ లాంటి ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా నాకు అండదండగా ఉన్నారు. మీరు గెలిచి తీరాలని ఆశించారు. ఈ విజయం నాది కాదు.. ఓట్లేసిన వాళ్లదే. అందరికీ సాష్టాంగ నమస్కారం. నాకు నాయకత్వం ఆపాదించొద్దు. ఆ మత్తు తలకెక్కితే కష్టం. నిమ్మకూరులో నందమూరి తారకరామారావు ఇంట్లో పుట్టిన నేను.. ఆయన స్ఫూర్తితోనే ముందుకు వచ్చాను. ఇంత మెజారిటీతో గెలవడం మా చరిత్రలో ఎప్పుడూ లేదు. అంటే ఎక్కువ మంది నన్ను పనిచేయమని కోరుకుంటున్నారు.''

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top