రానురానూ రాజేంద్రప్రసాద్ తీరు అద్వాణ్నంగా తయారవుతోంది. మైక్ దొరికితే చాలు ఏం మాట్లాడతారో ఆయనకే తెలియని పరిస్థితి. ఏళ్లకొద్దీ అనుభవం ఉంటే ఏం లాభం? సభామర్యాదను పాటించకుండా స్టేజీపైనే బూతులు మాట్లాడుతున్నాడు. తాజాగా హాస్యబ్రహ్మ బ్రహ్మానందంను కించపరుస్తూ మాట్లాడాడు.
ఈవెంట్‌లో నోరు జారిన రాజేంద్రప్రసాద్
శనివారం నాడు స:కుటుంబానాం సినిమా ఈవెంట్‌కు బ్రహ్మానందంతో పాటు రాజేంద్రప్రసాద్ హాజరయ్యాడు. బ్రహ్మానందం ప్రసంగం ముగిసిన తర్వాత రాజేంద్రప్రసాద్‌కు మైక్ ఇచ్చారు. పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందంగారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్లు మాట్లాడటం.. అంటూ స్పీచ్ మొదలుపెట్టారు.
నటుడిపై ఆగ్రహం
ఇంతలో సడన్‌గా బ్రహ్మానందం (Brahmanandam)తో నువ్వు ముసలి ** కొడుకువి అంటూ నోరు జారాడు. ఆ మాటకు షాకైన బ్రహ్మానందం ఎవరు? అని అడగ్గానే నేనే అంటూ కవర్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజేంద్రప్రసాద్‌ను నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ప్రతిసారి ఇలా నోరు జారడం అలవాటైపోయిందని మండిపడుతున్నారు.
వివాదాలతో సావాసం
వివాదాలు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad)కు కొత్తేమీ కాదు. రాబిన్‌హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డేవిడ్ వార్నర్‌ను అసభ్య పదజాలంతో సంబోధించాడు. ఓ ఈవెంట్‌లో ఎవరూ చప్పట్లు కొట్టకపోతే బ్రెయిన్ పోయిందా? చప్పట్లు కొట్టకపోతే సిగ్గు లేనట్లే అని చులకనగా మాట్లాడాడు. మరో ఈవెంట్‌లో కమెడియన్ అలీని దారుణంగా తిట్టాడు. అయితే ఓ ఇంటర్వ్యూలో దీనిపై క్షమాపణలు చెప్తూ మరోసారి నోరు జారనని హామీ ఇచ్చాడు. ఇంతలోనే బ్రహ్మానందాన్ని కించపరిచేలా కామెంట్స్ చేసి విమర్శలపాలయ్యాడు.


