రామ్‌కిరణ్, మేఘా ఆకాశ్ జంటగా రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘సఃకుటుంబానాం’. ఉదయ్ శర్మ దర్శకత్వంలో మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 12న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నేను చేసిన పాత్రకు చాలెంజ్‌లు ఉన్నాయి. కుటుంబం నేపథ్యంలో కుటుంబం గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను తెలియజేసే ఈ చిత్రం ప్రేక్షకులందరికీ నచ్చుతుంది’’ అని చెప్పారు.
ఆయన చనిపోవడంతో..
బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నేను పోషించిన పాత్ర చాలా చిత్రంగా ఉంటుంది. దర్శకుడు ఉదయ్ శర్మ తనకు కావాల్సిన అవుట్‌పుట్ రాబట్టుకోగలిగిన మంచి దర్శకుడు’’ అని పేర్కొన్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడుతూ– ‘‘నా స్నేహితుడు విక్రమ్ ఒక స్టోరీ లైన్‌ను సినిమాగా చేయాలనుకున్నాడు. కానీ ఆయన చనిపోవడంతో తన ఫ్రెండ్ ఉదయ్ ఆ లైన్‌ను కథగా మార్చి, సినిమా చేస్తున్నాడని చెప్పినప్పుడు చాలా హ్యాపీ ఫీలయ్యాను. ఈ సినిమా సుకుమార్‌గారి ఐడియాతో ఉంటుంది. ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.
పదహారేళ్ల కల నెరవేరింది
‘‘హీరో కావాలనుకున్న నా పదహారేళ్ల కల ఈ సినిమాతో నిజమైంది’’ అని చెప్పారు రామ్‌కిరణ్. ‘‘నా తొలి చిత్రానికి మణిశర్మగారు సంగీతం అందించడాన్ని గొప్ప విజయంగా భావిస్తున్నాను’’ అన్నారు ఉదయ్ శర్మ. ‘‘మా హెచ్‌ఎన్‌జీ బ్యానర్‌లో వస్తున్న తొలి చిత్రమిది. ప్రేక్షకులు ఈ సినిమాను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’’ అని మహదేవ్ గౌడ్ మాట్లాడారు.


