ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
ఫెయిల్యూర్
నాటి దేవదాసు నుండి నేటి గర్ల్ ఫ్రెండ్ వరకు ప్రేమను ఓ అందమైన దృశ్య కావ్యంగా చిత్రీకరించిన సినిమాలు ఎన్నో వచ్చాయి. సక్సెస్‌ఫుల్ ప్రేమ ముందుగా ఫెయిల్యూర్‌తోనే పుడుతుంది. అది ఏ కాలమైనా, ప్రాంతమైనా, భాష అయినా ఇదే సిద్ధాంతం. అందుకేనేమో ఈ థీమ్‌తో వచ్చిన సినిమాలు ప్రేక్షకుల మదిలో అలా పదిలంగా నిలిచిపోతాయి. కానీ ఓ సీరియస్ ప్రేమ అయిన స్వీట్‌కు కామెడీ అనే కారం తగిలిస్తే ఎలా ఉంటుందో తెలిపేదే ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’.
ఎలా ఉందంటే?
ఈ సినిమా పేరుతోనే దర్శకుడు ప్రేక్షకుడికి కాస్తంత గిలిగింతలు పెట్టించాడు. కాస్త లోతుగా గమనిస్తే సెటైరికల్ మోడ్‌లో మహా గమ్మత్తుగా ఉందీ టైటిల్. శశాంక్ ఖేతన్ ఈ కథ రాసి, దర్శకత్వం వహించారు. వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ జంటగా, సాన్యా మల్హోత్రా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం రూ. వంద కోట్ల వసూళ్లు దక్కించుకుంది. అంతలా ఏముందో ఈ సినిమాలో ఓసారి చూద్దాం.
సన్నీ సంస్కారి తన గర్ల్ ఫ్రెండ్ అయిన అనన్యకు వినూత్న రీతిలో... ఇంకా చెప్పాలంటే బాహుబలి సెటప్‌లో కాస్త భారీగానే ప్రపోజ్ చేయడానికి ప్లాన్ చేస్తాడు. సెటప్, గెటప్ అంతా బాగానే ఉన్నా అనన్య మాత్రం కోటీశ్వరుడైన విక్రమ్‌తో తన తల్లిదండ్రులు తనకు పెళ్ళి నిర్ణయించారని సంస్కారికి ససేమిరా నో చెబుతుంది.
ఇది విన్న సన్నీ బాగా బాధపడి ఎలాగైనా అనన్యను సొంతం చేసుకోవాలని విక్రమ్ గురించి ఆరా తీస్తాడు. తులసీ కుమారి అనే అమ్మాయితో ఇటీవలే విక్రమ్‌కు బ్రేకప్ అయిన విషయం తెలుసుకొని తులసీ కుమారిని కలవడానికి వెళతాడు. ఈ లోపల అనన్య, విక్రమ్‌ల పెళ్ళి ఆహ్వాన పత్రిక సన్నీతో పాటు తులసీ కుమారికి కూడా అందుతుంది. తులసీతో కలిసి సన్నీ ఈ పెళ్ళి చెడగొట్టడానికి ఓ కుట్ర పన్నుతాడు (Sunny Sanskari Ki Tulsi Kumari Movie Review).
మరి... సన్నీ ప్లాన్ సక్సెస్ అయి, అనన్యను పెళ్ళి చేసుకుంటాడా? అలాగే విక్రమ్, తులసీ కుమారి మళ్ళీ కలిసిపోతారా? అన్న విషయం మాత్రం నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’ సినిమాలోనే చూడాలి. వరుణ్ తన ఈజ్‌తో... అలాగే జాన్వీ తన క్రేజ్‌తో యూత్‌ని బాగా అలరించే సినిమా ఇది. అక్కడక్కడా కాస్త ఓవర్ యాక్షన్ అనిపించినా సినిమా ఎక్కడా బోర్ కొట్టదు... సరికదా సరదాగా సాగిపోతుంది. వర్త్ టు వాచ్.
– హరికృష్ణ ఇంటూరు


