‘‘రవితేజ (Raviteja)గారికి నేను అభిమానిని. సూపర్ ఎనర్జీ మనిషి రూపంలో ఉంటే అది మాస్‌మహారాజ రవితేజ. ఓ మామూలు మనిషిని స్క్రీన్‌పైకి తీసుకువచ్చి కింగ్ సైజ్‌లో సహజంగా చూపించే పాత్రలు చేస్తుంటారు. మన జీవితంలో కలలు నిజమౌతాయని ఆయన గుర్తు చేస్తుంటారు. ‘మాస్ జాతర’ బ్లాక్‌బస్టర్ కావాలి’’ అని హీరో సూర్య అన్నారు. రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మాస్ జాతర’. శ్రీలీల హీరోయిన్‌గా నటించగా, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటించారు.
రవితేజపై సూర్య పొగడ్తల వర్షం
భాను భోగవరపు దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన సూర్య మాట్లాడుతూ.. ‘‘ప్రేక్షకులను నవ్వించడం కష్టమైన పని. ఎన్నో సంవత్సరాలుగా ప్రేక్షకులను రవితేజ ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఈ తరహా నైపుణ్యం తక్కువమందికి ఉంటుంది.
ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటాం
అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ గార్లు మంచి కామిక్ టైమింగ్‌తో యాక్ట్ చేస్తుంటారు. రవితేజ గురించి కార్తీ, నేను, జ్యోతిక మాట్లాడుకుంటూ ఉంటాం. ‘విక్రమార్కుడు, కిక్’ సినిమాలు చూశాను. తమిళంలో కూడా రవితేజకి అభిమానులు ఉన్నారు. అక్టోబరు 31న థియేటర్స్‌లో రవితేజ జాతర’’అని అన్నారు. రవితేజ మాట్లాడుతూ–‘‘సూర్యగారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మంచి వ్యక్తి. ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా ఉంది.

అభిమానులను నిరాశపర్చదు: రవితేజ
‘మాస్ జాతర’ సినిమా చూశాను. హ్యాపీగా ఉంది. ఈ సినిమాతో నవీన్ నెక్ట్స్ లెవల్‌కి వెళ్తాడనిపిస్తోంది. రాజేంద్రప్రసాద్‌గారితో నా కాంబినేషన్ సీన్స్ అలరిస్తాయి. ఇందులో మాస్ క్యారెక్టర్ చేశారు శ్రీలీల. భానురూపంలో మన ఇండస్ట్రీకి ఓ మంచి దర్శకుడు వస్తున్నాడు. ఈ సినిమాలోని పాటలను, ముఖ్యంగా ఆర్‌ఆర్‌ను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా నా అభిమానులను నిరాశపరచదు’’ అని చెప్పారు. శ్రీలీల మాట్లాడుతూ–‘‘ఈ చిత్రంలో తులసి అనే మాస్ క్యారెక్టర్ చేశాను.
ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా!: రాజేంద్రప్రసాద్
రవితేజగారిని చూసి చాలా నేర్చుకున్నాను. సూర్యగారికి నేను పెద్ద అభిమానిని’’ అన్నారు. ‘‘మాస్ జాతర’ సినిమా ఆడియన్స్‌ను అలరిస్తుంది’’ అని పేర్కొన్నారు నిర్మాత నాగవంశీ. ‘‘అరవిందసమేత వీరరాఘవ’ చిత్రంలో నేను చేసిన బాల్ రెడ్డి పాత్ర తర్వాత ‘మాస్ జాతర’లో నేను చేసిన శివుడు క్యారెక్టర్‌ను ఆడియన్స్ గుర్తు పెట్టుకుంటారు’’ అని చెప్పారు నవీన్ చంద్ర. ‘‘రవితేజగారు నా కథ విని, సితార వంటి ఓ పెద్ద నిర్మాణ సంస్థలో అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు’’ అని భాను భోగవరపు పేర్కొన్నారు. ‘‘మాస్ జాతర’ చూసి ప్రేక్షకులు షాక్ అవ్వకపోతే సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతాను. నా క్యారెక్టర్ ఏంటో థియేటర్స్‌లో చూడండి’’ అని తెలిపారు రాజేంద్ర ప్రసాద్.


