దక్షిణాది చిత్ర పరిశ్రమలో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ఈ బ్యూటీ హీరోయిన్‌గా తన పదేళ్ల ప్రయాణాన్ని పూర్తిచేసుకుంది. 2015లో ప్రేమమ్ అనే మలయాళం చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత తమిళం, తెలుగు భాషల్లో ఎంట్రీ ఇచ్చి ఈ రెండు భాషల్లోనూ మంచి అవకాశాలు పొందుతూ పేరు తెచ్చుకుంది. మొదట్లో పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ను సంపాదించుకున్న ఈమె ఇటీవల కొన్ని చిత్రాల్లో మితిమీరిన అందాలారబోత, లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించి విమర్శలను ఎదుర్కొంది.
రెండు ఫ్లాప్స్.. వెంటనే సక్సెస్
ఇకపోతే జయాపజయాలు ఎవరికైనా సహజమే. ఈ అమ్ముడు కూడా కొన్ని అపజయాలను చవిచూసింది. ముఖ్యంగా ఆ మధ్య తమిళంలో రవిమోహన్‌కు జంటగా నటించిన సైరన్, ఇటీవల తెలుగులో నటించిన పరదా చిత్రాలు అనుపమపరమేశ్వరన్‌ను తీవ్ర నిరాశకు గురిచేశాయి. అలాంటిది తాజాగా ఈమె నటించిన తెలుగుచిత్రం కిష్కింధపురి సక్సెస్ అందుకుంది. అదేవిధంగా తమిళంలో నటించిన బైసన్ విజయం ఈమెకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది అనే చెప్పాలి. ఇందులో అనుపమ పరమేశ్వరన్ పాత్ర పరిమితమే అయినా, ఉన్నంతవరకు ఆ పాత్రకు న్యాయం చేసిందంటూ ప్రశంసలు అందుకుంటోంది.
యాక్టింగే రాదన్నారు
అలా మళ్లీ హిట్‌ట్రాక్‌లో పడ్డ ఈ బ్యూటీ ప్రస్తుతం లాక్‌డౌన్ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. ఈసందర్భంగా ఒక ఇంటర్వ్యూలో అనుపవమా పరమేశ్వరన్ మాట్లాడుతూ.. తన తొలిచిత్రం ప్రేమమ్ విడుదల తర్వాత తనపై జరిగిన ట్రోలింగ్స్‌తో చాలా భయపడ్డానంది. ముఖ్యంగా తనకు నటనే రాదని మలయాళ చిత్ర పరిశ్రమలో విమర్శించారంది. అయినా తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపింది. ఇప్పుడు తనను చూసి తానే గర్వపడుతున్నానని పేర్కొంది. నట జీవితంలో ఒక కొత్త చాప్టర్‌లో ప్రవేశించినట్లు చెప్పుకొచ్చింది.
చదవండి: యానిమేటెడ్ బాహుబలి


