‘ఆ రోజు వరకూ పోరాడుతూనే ఉంటా’

Tamannaah Bhatia Happy With Her Movie career - Sakshi

ఆ రోజు వరకూ పోరాడుతూనే ఉంటాను అంటోంది నటి తమన్న. ఇంతకీ దేని కోసం ఈ అమ్మడి పోరాటం. ఏం పొందాలనుకుంటోంది? లాంటి సందేహాలు కలగడం సహజం. ఎందుకంటే ఈ మిల్కీబ్యూటీ ఇప్పటికే నటిగా పోరాడి భారతీయ సినిమాలో తనకుంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా టాలీవుడ్‌, కోలీవుడ్‌లో మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు. అలా దశాబ్దంన్నర పాటు అందాలతారగా, అగ్ర నటీమణుల్లో ఒకరిగా రాణిస్తున్నారు. ఇటీవల తెలుగు చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రంలో కూడా తన పాత్ర పరిధి తక్కువే అయినా అద్భుతంగా నటించి ఆ పాత్రకు ప్రాణం పోశారు. అయితే విశాల్‌తో జత కట్టిన యాక్షన్‌ చిత్రం నిరాశ పరిచింది. 

అయితే ఏదేమైనప్పటికీ ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. తెలుగు, తమిళం భాషల్లో అస్సలు అవకాశాలు లేవు. హిందీలో మాత్రం ఒకటి రెండు చిత్రాల్లో నటిస్తోంది. తనకు అవకాశాలు లేవన్నది తమన్న అంగీకరించడం లేదు. తాను ఇప్పటికీ బిజీగానే ఉన్నానని చెప్పుకుంటున్నారు. ఇటీవల ఈ అమ్మడు ఒక భేటీలో పేర్కొంటూ చిన్న వయసులోనే తాను విజయాలను చూశానన్నారు. అందువల్ల అపజయాలను కూడా విజయాల మాదిరి సమానంగా తీసుకోగల మానసిక పరిపక్వత తనకు ఉంది అని చెప్పారు. సినిమా ఇప్పుడు మార్పులను సంతరించుకుంటోందని, సామాజిక మాధ్యమాల ఆధిక్యం అధికం అవుతోందని పేర్కొన్నారు. 

ప్రతిభ కలిగిన వారు సులభంగా ఈ రంగంలోకి ప్రవేశించే పరిస్థితి అని చెప్పారు. మరో విషయం ఏమిటంటే సినిమాలో తాను పెద్దగా సాధించిందేమీ లేదని స్పష్టం చేశారు. తనకు సంతృప్తి కలిగేలా ఏదైనా చేసే వరకూ ఇక్కడ పోరాడుతూనే ఉంటానన్నారు. అలాంటి రోజు వచ్చిన తరువాత ఆగిపోతానని తమన్న పేర్కొన్నారు. ఈ అమ్మడు ఇప్పుడిప్పుడే సినిమాను వదిలేలా లేరు. మూడు పదుల వయసును టచ్‌ చేసిన తమన్న ఏదో సాధించాలని అక్క, వదిన పాత్రలు చేసేస్తుందేమో!.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top