తను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు: సుశాంత్‌ తండ్రి | Sushant Singh Rajput Father Says Actor Was Looking To Get Married In 2021 | Sakshi
Sakshi News home page

తనకు ఆ స్వేచ్ఛ ఇచ్చాం.. కానీ: సుశాంత్‌ తండ్రి

Jun 26 2020 10:44 AM | Updated on Jun 26 2020 1:29 PM

Sushant Singh Rajput Father Says Actor Was Looking To Get Married In 2021 - Sakshi

ముంబై: ‘‘పెళ్లి చేసుకోమని సుశాంత్‌ను ఎన్నోసార్లు అడిగాం. కరోనా, లాక్‌డౌన్‌ పరిస్థితుల నుంచి బయటపడ్డాకే నిర్ణయం తీసుకుంటా అని చెప్పాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో పెళ్లి చేసుకునేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నానన్నాడు. పెళ్లి విషయం గురించి తనతో జరిగిన చివరి సంభాషణ అదే’’ అంటూ బాలీవుడ్‌ దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ తండ్రి కేకే సింగ్‌ ఉద్వేగానికి లోనయ్యారు. తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకునే స్వేచ్ఛ సుశాంత్‌కు ఇచ్చామని.. కానీ ఆ ముచ్చట తీరకుండానే తను శాశ్వతంగా తమకు దూరమయ్యాడని భావోద్వేగానికి గురయ్యారు. తన కొడుకు అందరితో కలివిడిగా ఉండేవాడని.. కానీ ఆత్మహత్యకు కొన్నిరోజుల ముందు తను ఎందుకు గంభీరంగా మారిపోయాడో తెలియదని ఆవేదన చెందారు.(‘సుశాంత్‌ భార్య, తల్లీ.. అప్పుడు అన్నీ నువ్వే అంకిత’)

ఇటీవల ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన కేకే సింగ్‌ను సుశాంత్‌ వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నించగా.. తన స్నేహితురాళ్ల గురించి తమకు తెలుసునన్నారు. నటి అంకిత లోఖండేతో తమ కుటుంబానికి పరిచయం ఉందని తెలిపారు. ముంబైతో పాటు తమ స్వస్థలం పట్నాలోని ఇంటికి కూడా ఆమె వచ్చిందని పేర్కొన్నారు. అదే విధంగా హీరోయిన్‌ కృతి సనన్‌ను కూడా ఓసారి ముంబైలో కలిశానన్న కేకే సింగ్‌.. ప్రస్తుతం సుశాంత్‌ ప్రియురాలిగా ప్రచారంలో ఉన్న రియా చక్రవర్తి గురించి మాత్రం తనకు ఏమీ తెలియదన్నారు. కాగా బుల్లితెర నటుడిగా ఎంట్రీ ఇచ్చిన సుశాంత్‌.. ఆ తర్వాత బీ-టౌన్‌లో ప్రవేశించి స్టార్‌ హీరోగా ఎదిగిన సంగతి తెలిసిందే. అయితే టీవీ నటుడిగా ఉన్న సమయంలో ‘పవిత్ర రిష్తా’ సీరియల్‌లో తనకు జోడీగా నటించిన అంకిత లోఖండేను సుశాంత్‌ ప్రేమించాడు. ఆరేళ్లపాటు సన్నిహితంగా మెలిగిన వీరు.. తమ మధ్య విభేదాలు తలెత్తడంతో స్నేహపూర్వకంగా విడిపోతున్నట్లు ప్రకటించారు. (నీ శత్రువు అదే‌: కృతి సనన్‌ భావోద్వేగం)

కాగా కృతిసనన్‌కు దగ్గరైనందువల్లే సుశాంత్‌.. అంకితకు బ్రేకప్‌ చెప్పాడని రూమర్లు ప్రచారం కాగా వారిద్దరు ఈ వార్తలను కొట్టిపడేశారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం రియా చక్రవర్తి పేరు తెరమీదకు వచ్చింది. వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ బీ-టౌన్‌లో టాక్‌ వినిపించింది. కాగా బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న సుశాంత్‌.. గత కొన్ని రోజులుగా అవకాశాలు చేజారడంతో డిప్రెషన్‌కు లోనై జూన్‌ 14న ముంబైలోని తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడిన విషయం విదితమే. అతడి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులతో పాటు అంకిత లోఖండే, కృతి సనన్‌, శ్రద్ధా కపూర్‌ తదితర సెలబ్రిటీలు హాజరై అంతిమ వీడ్కోలు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement