నీ శత్రువు అదే‌: కృతి సనన్‌ భావోద్వేగం | Kriti Sanon Heartbreaking Tribute To Co Star Sushant Singh Rajput | Sakshi
Sakshi News home page

సుశాంత్‌ ఆత్మహత్య: కృతి సనన్‌ భావోద్వేగం

Jun 16 2020 7:05 PM | Updated on Jun 16 2020 8:17 PM

Kriti Sanon Heartbreaking Tribute To Co Star Sushant Singh Rajput - Sakshi

‘‘సుశ్‌.. ఎంతో చురుకైన నీ మెదడే నీ బెస్ట్‌ ఫ్రెండ్‌ అని.. అదే నీ శత్రువు కూడా అని నాకు తెలుసు.. కానీ బతకడం కంటే కూడా చావడమే సులభమని నువ్వు భావించే క్షణం వస్తుందన్న విషయం నన్ను కుంగదీస్తోంది. ఆ ఒక్క క్షణం గడిచిపోయేలా నీ చుట్టూ మనుషులు ఉంటే బాగుండును, నిన్ను ప్రేమించే వాళ్లను నువ్విలా దూరంగా నెట్టేయకుండా ఉండాల్సింది.. నీ లోపల చెలరేగిన అలజడిని నేను దూరం చేసి ఉంటే బాగుండు అనిపిస్తోంది.. కానీ చేయలేకపోయాను.. ఇంకా ఏవేవో జరగాలని కోరుకుంటున్నాను.. నా హృదయంలోని ఓ భాగాన్ని నువ్వు పట్టుకెళ్లావు.. అది నిన్ను ఎప్పుడూ సజీవంగానే ఉంచుతుంది.. నీ సంతోషం కోసం ఎల్లప్పుడూ ప్రార్థిస్తూనే ఉంటాను’’ అంటూ బాలీవుడ్‌ హీరోయిన్‌ కృతి సనన్‌ భావోద్వేగానికి లోనయ్యారు. సహ నటుడు, స్నేహితుడు సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ను గుర్తు చేసుకుంటూ అతడితో కలిసి దిగిన ఫొటోలను మంగళవారం ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.(సుశాంత్‌ది ఆత్మహత్యా? హత్యా: కంగన ఫైర్‌)

కాగా టీవీ నటుడిగా కెరీర్‌ ఆరంభించిన సుశాంత్‌.. ’పవిత్ర రిష్తా’ సీరియల్‌తో తనకు జోడీగా కనిపించిన అంకిత లోఖండేను ప్రేమించిన విషయం తెలిసిందే. విభేదాల వల్ల విడిపోయిన వీళ్లిద్దరూ మళ్లీ కెరీర్‌పై దృష్టి సారించి ముందుకు సాగారు. ఈ క్రమంలో బాలీవుడ్‌లో హీరోగా బిజీ అయిన సుశాంత్‌.. రాబ్తా సినిమాలో తనతో కలిసి నటించిన కృతి ప్రేమలో పడ్డాడంటూ బీ- టౌన్‌లో వదంతులు ప్రచారమయ్యాయి. పైగా కృతి సనన్‌ వల్లే సుశాంత్‌ అంకితకు దూరమయ్యాడని రూమర్లు వినిపించాయి.(ఇక్కడ ఎవరూ ఎవరినీ పట్టించుకోరు: సైఫ్‌ అలీఖాన్‌)

ఈ వార్తలపై స్పందించిన కృతి సనన్‌.. తమ మధ్య స్నేహమే తప్ప.. ఇతర రిలేషన్‌ షిప్‌ ఏమీ లేదని, తాను ఎవరితోనూ డేటింగ్‌ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సుశాంత్‌ ఆత్మహత్య విషయం తెలిసిన వెంటనే స్పందించలేదంటూ కొంతమంది నెటిజన్లు కృతి సనన్‌ ట్రోల్‌ చేశారు. స్నేహితుడు బలవన్మరణానికి పాల్పడితే ఆమె నుంచి కనీస స్పందన కరువైందని కామెంట్లు చేశారు. ఈ విషయంపై స్పందించిన కృతి సనన్‌ సోదరి.. తన అక్క ప్రస్తుతం షాక్‌లో ఉందని.. ఇలాంటి పరిస్థితుల్లో తనను నిందించడం సరికాదంటూ సోషల్‌ మీడియా వేదికగా ట్రోలర్స్‌కు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement