
వివాదాల్లో చిక్కుకున్న నటుడు సూర్య
నటుడు సూర్య ఒక యువ ఫుట్‌బాల్ క్రీడాకారుడిపై చేయి చేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు...
తమిళసినిమా: నటుడు సూర్య ఒక యువ ఫుట్‌బాల్ క్రీడాకారుడిపై చేయి చేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై అడయారు సమీపంలోని శాస్త్రీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. వివరాలు.. స్థానిక పారిస్‌కు చెందిన ఫుట్‌బాల్ క్రీడాకారుడు ప్రవీణ్‌కుమార్ స్నేహితుడితో కలిసి మోటార్‌బైక్‌లో అడయార్‌లోని తిరువీక బ్రిడ్జిపై వెళుతున్నారు. ఆ సమయంలో ముందు వెళుతున్న కారు సడన్‌గా ఆగడంతో ప్రవీణ్‌కుమార్ మోటార్‌బైక్ కారును ఢీకొంది. దీంతో కారు నడుపుతున్న యువతికి ప్రవీణ్‌కుమార్‌కు మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయింది. అదే సమయంలో అటుగా కారులో వచ్చిన సూర్య అక్కడ గుమిగూడిన జనాన్ని చూసి ఘర్షణ పడుతున్న వారితో చర్చించారు. అయితే ఈ విషయంలో సూర్య ప్రవీణ్‌కుమార్ మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో ప్రవీణ్‌కుమార్ సమీపంలోని శాస్త్రీనగర్ పోలీస్‌స్టేషన్‌లో సూర్యపై ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో సూర్య తనను కొట్టార ని, తాను అవమానంతో ఆత్మహత్యకు పాల్పడితే దానికి కారణం ఆయనే అన్నారు.
సూర్యపై తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సంఘటన గురించి నటుడు సూర్య మాట్లాడుతూ అడయారు సమీపంలో యువతితో గొడవ పడుతున్న ఇద్దరు యువకులను తాను సర్దిచెప్పే ప్రయత్నం మాత్రమే చేశానని, యువకుల నుంచి ఆమెను కాపాడడానికి పోలీసులకు ఫోన్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయానని చెప్పారు. తాను యువకుడిపై చేయి చేసుకున్న విషయం అవాస్తవం అని స్పష్టం చేశారు.