పిల్లల సక్సెస్‌ చూసినప్పుడే ఆనందం

Raghavendra Rao Speech At Sirivennela Movie Audio Launch - Sakshi

– కె.రాఘవేంద్రరావు

‘‘మీ తాతయ్య(రాజేంద్రప్రసాద్‌) నవ్వించేవారు.. నువ్వు(సాయి తేజస్విని) భయపెడుతున్నావ్‌. ‘మహానటి’ చిత్రంతో నటన మొదలుపెట్టావు. మన సక్సెస్‌ కన్నా మన పిల్లల సక్సెస్‌ చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది’’ అని డైరెక్టర్‌ కె.రాఘవేంద్రరావు అన్నారు. ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కిన హారర్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘సిరివెన్నెల’. ప్రకాష్‌ పులిజాల దర్శకత్వం వహించారు. ‘మహానటి’ ఫేమ్‌ సాయి తేజస్విని, ‘బాహుబలి’ ఫేమ్‌ ప్రభాకర్, అజయ్‌ రత్నం, రాకెట్‌ రాఘవ కీలక పాత్రల్లో నటించారు.

కమల్‌ బోరా, ఏఎన్‌బాషా, రామసీత నిర్మించిన ఈ సినిమా పాటల విడుదల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘నిర్మాతల్లో ఒకరైన బాషాకి రాఘవేంద్రరావు తెలుసు.. రాజమౌళి తెలుసు... అందరితోనూ పని చేశాడు. నా సినిమాలకు చాలా వరకు ఆయనే నేపథ్య సంగీతం అందించారు. నేపథ్య సంగీతం లేకపోతే సినిమానే లేదు. సావిత్రిలాగా అటు మోడ్రన్, ఇటు ట్రెడిషనల్‌.. ఇలా ఏ పాత్రకైనా ప్రియమణి సరిపోతుంది’’ అన్నారు.

నటుడు డా.రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘తెలుగు సంగీతాన్ని అంతర్జాతీయ స్థాయికి పరిచయం చేసిన కీరవాణిగారిని, ఆర్‌.పి. పట్నాయక్‌.. ఇంకా ఇంత మంచి మహానుభావులను ఒకే వేదికపై కలవడం ఆనందంగా ఉంది. మా మనవరాలు గురించి నేను చెప్పకూడదు.. ప్రేక్షకులే ఈ సినిమా చూసి ఎలా నటించిందో చెప్పాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమాతో నా రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభం అయినట్లే. టీజర్, ట్రైలర్‌ చాలా బాగున్నాయి. తేజస్విని బాగా నటించింది’’ అన్నారు ప్రియమణి. ‘‘నేను చేసిన ‘అనగనగా ఓ దుర్గ’ చిత్రం చూసి బాషాగారు కథ చెప్పమన్నప్పుడు ‘సిరివెన్నెల’ కథ చెప్పాను. బాషాగారికి, బోరాగారికి నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌ కుదిరింది’’ అన్నారు ఓం ప్రకాష్‌. ‘‘ఈ సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా విజయం సాధిస్తుంది’’ అని బాషా, కమల్‌ బోరా అన్నారు. డైరెక్టర్‌ వైవీఎస్‌ చౌదరి, సంగీత దర్శకులు ఎం.ఎం. కీరవాణి, ఆర్‌.పి. పట్నాయక్, నిర్మాత సురేష్‌ కొండేటి  తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top