జైలులో నిద్రలేని రాత్రి గడిపా : పాయల్‌

Payal Rohatgi Says She Spent Sleepless Night In Jail - Sakshi

గాంధీ-నెహ్రు కుటుంబాలను కించపరిచేలా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారనే కారణంతో బాలీవుడ్‌ నటి పాయల్‌ రోహత్గిని రాజస్తాన్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె మంగళవారం సాయంత్రం బుండి సెంట్రల్‌ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. తనను బయటకు తీసుకురావడానికి ప్రయత్నించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. జైలులో చాలా భయపడినట్టు చెప్పిన పాయల్‌.. ప్రస్తుతం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు. జైలులో రాత్రి నిద్ర పట్టలేదని.. చాలా భయమేసిందని చెప్పారు. 

‘నేను ఎప్పుడు దేశం గురించే ఆలోచిస్తాను. అలాగే చరిత్రను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. కానీ అకారణంగా జైలుకు వెళ్లాలని కోరుకోను. భవిష్యత్తులో వీడియోలు తీయడం మానుకోను. ఇకపై మరోసారి తప్పు జరగకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాను. నెహ్రు కుటుంబంపై నేను చేసిన వీడియో.. చిక్కులు తీసుకువస్తుందని అనుకోలేదు. నాకు చట్టాలపై అంతగా అవగాహన లేదు. చట్టపరమైన సమస్యలు ఎదురుకాకుండా.. భావ ప్రకటన స్వేచ్ఛని సద్వినియోగం చేసుకుంటాను. న్యాయవ్యవస్థకు చాలా ధన్యవాదాలు’ అని పాయల్‌ చెప్పారు.

జైలులో గడిపిన అనుభవం గురించి మాట్లాడుతూ.. ‘నన్ను లేడీస్‌ జనరల్‌ వార్డ్‌లో ఉంచారు. అక్కడ చాలా చలిగా ఉండటంతో.. రాత్రి అంతా నిద్ర లేకుండా గడిపాను. చాపపై పడుకున్నాను. అక్కడి పరిస్థితులు చూస్తే చాలా భయమేసింది. జైలులో ఆహారం అసలు బాగోలేదు. కానీ స్పైసీ ఫుడ్‌ కోరుకునే వారికి అది బాగుంటుంది. నేను జైలుకు వెళ్లడం మొదటిసారి.. ఇదే చివరిసారి కూడా అవుతుందని అనుకుంటాన’ని తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top