65 ఏళ్ల వారికి షూటింగ్‌కి అనుమతి లేదు!

No Shooting For Above 65 Years Age Actors - Sakshi

‘వయసనేది కేవలం ఒక నంబర్‌ మాత్రమే. మన మనసు యంగ్‌గా ఉంటే సిక్స్‌టీ ప్లస్‌లోనూ యంగ్‌ ఏజ్‌లో ఉండేంత హుషారుగా ఉండొచ్చు’ అంటారు. అమితాబ్‌ బచ్చన్‌లాంటి వారిని చూస్తే అది నిజమేనేమో అనిపిస్తుంది. 70 ప్లస్‌ ఏజ్‌లోనూ అమితాబ్‌ విరామం లేకుండా సినిమాలు, టీవీ షోలు, వాణిజ్య ప్రకటనలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. ఇప్పుడు అమితాబ్‌ వంటి సీనియర్ల వేగం తగ్గనుందా? అంటే.. వారు తగ్గాలనుకోవడంలేదు కానీ ప్రభుత్వ నిబంధన అలా ఉంది. విషయంలోకి వస్తే... 

‘ఇక షూటింగ్‌లు చేసుకోవచ్చు’ అంటూ మహారాష్ట్ర ప్రభుత్వం సినిమా, టీవీ షూటింగులకు అనుమతి ఇచ్చింది. కొన్ని నిబంధనలను కూడా సూచించింది. సామాజిక దూరం, తక్కువమందితో షూటింగ్, శుభ్రత.. ఇలా కొన్ని రూల్స్‌ పాటించాలని కోరింది. ఇవన్నీ ఓకే కానీ రెండే రెండు నిబంధనల విషయంలో ఇబ్బంది ఎదురవుతుందని సినీ, టీవీ రంగాలు భావిస్తున్నాయి. ‘65 ఏళ్లు పైబడినవారిని షూటింగ్‌లకు అనుమతించకూడదు. లొకేషన్‌లో ఒక డాక్టర్, ఒక నర్స్‌ కచ్చితంగా ఉండాలి’ అనేవి ఆ రెండు నిబంధనలు. వృద్ధులకు రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి కరోనా వైరస్‌ త్వరగా సోకే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని వైద్యులు అంటున్నారు. బహుశా 65 ఏళ్లు పైబడిన నటీనటులు, సాంకేతిక నిపుణులు షూటింగులకు వద్దని ప్రభుత్వం అందుకే పేర్కొని ఉంటుంది.

లొకేషన్‌లో ఎవరైనా అస్వస్థకు గురైతే వెంటనే వైద్యం చేయడానికి డాక్టర్, నర్స్‌ ఉంటే బాగుంటుందనే అభిప్రాయంతో ఆ నిబంధన విధించి ఉంటుంది. అయితే ఈ రెండు నిబంధనలు అమలు చేయడం సాధ్యం కాకపోవచ్చని ప్రభుత్వానికి  ‘ఇండియన్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌’ (ఐఎఫ్‌టిడిఎ) వినతిపత్రం సమర్పించింది. అందులో ఉన్న సారాంశం ఈ విధంగా... ‘‘షూటింగ్‌కి అనుమతి ఇచ్చినందుకు మహారాష్ట్ర సినీ, టీవీ రంగాలకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణుల తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు. రెండు నిబంధనలు తప్ప మిగతావన్నీ ఆమోదనీయంగానే ఉన్నాయి. 65 ఏళ్లకు పైబడినవారిని షూటింగ్‌కి అనుమతించకూడదంటే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్న నటుల్లో అమితాబ్‌ బచ్చన్, అనుపమ్‌ ఖేర్, నసీరుద్దిన్‌ షా, పరేష్‌ రావల్, శక్తీ కపూర్, జాకీ ష్రాఫ్, మిథున్‌ చక్రవర్తి వంటివారు, సుభాష్‌ ఘయ్, డేవిడ్‌ ధావన్, శ్యామ్‌ బెనెగల్, మహేష్‌ భట్, శేఖర్‌ కపూర్, మణిరత్నం, ప్రకాశ్‌ ఝా, జావేద్‌ అక్తర్, ప్రియదర్శన్‌ తదితర ఫిలిం మేకర్స్‌ అందరూ 65ఏళ్లు, ఆ పైన ఉన్నవారే. వీళ్లందరితో షూటింగ్‌ చేయకపోవడం అన్నది అసాధ్యం.
ఇండస్ట్రీకి చెందిన గొప్ప నిష్ణాణుతులకు పరిమితులు విధించడంవల్ల ఇబ్బంది అవుతుంది. అలాగే కోవిడ్‌–19 బారినపడిన వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుండటంతో వైద్యుల కొరత ఉంది. అందుకని ప్రతి లొకేషన్‌లోనూ ఒక డాక్టర్, ఒక నర్స్‌ని నియమించడం సాధ్యం కాకపోవచ్చు. అందుకు బదులుగా ఏయే ప్రాంతాల్లో షూటింగ్స్‌ జరుగుతాయో అక్కడ ఒక డాక్టర్, ఒక నర్స్‌ అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయగలం. పరిస్థితిని అర్థం చేసుకుని ఈ రెండు నిబంధనల్లో మార్పు చేయాలని విన్నవించుకుంటున్నాం’’ అని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. మరి.. ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అయితే ఇది ఒక్క ఉత్తరాది సమస్య మాత్రమే కాదు.. అన్ని భాషల్లోనూ 60 ఏళ్లకు పైబడిన స్టార్స్‌ ఉన్నారు. యాక్టివ్‌గా ఉన్నవారి సంఖ్య కూడా ఎక్కువే. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఐఎఫ్‌టిడిఎ విన్నపాన్ని ప్రభుత్వం ఆమోదిస్తుందని ఊహించవచ్చు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top