‘తల్లి అయ్యాక సినిమా అవకాశాలు రాలేదు: హీరోయిన్‌

Neha Dhupia: I did Not Get Any Film Offers After Pregnency - Sakshi

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత సినిమా వాళ్లకు సరిగా సరిపోతుందేమో. ముఖ్యంగా హీరోయిన్ల పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. అందుకే కెరీర్‌ సక్సెస్‌ ఫుల్‌గా ఉన్నప్పుడే వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. పొరపాటున పెళ్లి అయితే హిట్‌ మాట అటుంచితే అసలు అవకాశాలు దక్కవు అనడంతో సందేహం లేదు. అదే మరి ఓ బిడ్డకు జన్మనిచ్చాక వారి పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా ఛాన్సులు ఆ నటీమణుల దరిదాపుల్లో కనిపించవు. ప్రస్తుతం అదే సమస్యను ఎదుర్కొంటున్నారు బాలీవుడ్‌ నటి నేహా ధూపియా. బీఎఫ్‌ఎఫ్‌ విత్‌ వోఘ్‌ షోతో పేరు పొందిన నేహా.. తన బిడ్డకు జన్మనిచ్చాక ఎలాంటి సినిమా అవకాశాలు రాలేదని వాపోయారు. చివరగా నటించిన ‘తుమ్హారీ సులు’కు ప్రశంసలు, అవార్డులు సొంతం చేసుకున్నప్పటికీ  సినిమా ఛాన్సులు రాలేదని ఆమె స్పష్టం చేశారు. 

బాలీవుడ్‌ నటుడు అంగద్‌ బేడిని పెళ్లాడిన నేహాకు 2018లో పాప పుట్టిన విషయం తెలిసిందే. గత వారమే ముద్దుల తనయ మోహర్‌ పుట్టిన రోజున అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘ప్రెగ్నెన్సీ సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను.  అయితే ఆ సమయంలో అనేక పత్రికలు నన్ను ట్రోల్‌ చేస్తూ తప్పుగా వార్తలు రాశాయి. అలాంటి వార్తలు రాయడం సరికాదు. అవును నేను ఓ బిడ్డకు జన్మనిచ్చాను. అప్పటి నుంచి నాకు ఎలాంటి సినిమా అవకాశాలు రాలేదు. ప్రసవానంతరం ప్రతి ఒక్కరు బరువు తగ్గాలని నేను అనడం లేదు. ఎవరి ప్రత్యేకత వారికీ ఉంటుంది. ప్రస్తుతం వెబ్‌ షో కోసం చర్చలు జరుపుతున్నాను. చూద్దాం.. ఇకనైనా పరిస్థితి ఎలా ఉంటుందో​’ అంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top