మెర్సల్‌ డైలాగులను తొలగించేందుకు సిద్ధం

Mersal Makers on Controversial Dialogues  - Sakshi

సాక్షి, చెన్నై : బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలపై వ్యతిరేక డైలాగుల వివాదం కొనసాగుతుండగా.. అవసరమైతే వాటిని తొలగించేందుకు సిద్ధమని నిర్మాతలు ప్రకటించారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ థెనాందల్‌ స్టూడియో లిమిటెడ్‌  ఓ ప్రకటన వెలువరించింది. 

ప్రజా ఆరోగ్య విషయంలో భద్రత కోసమే ఆ డైలాగులు చేర్చామే తప్ప.. ప్రభుత్వ విధానాలను తప్పు పట్టడం వాటి ఉద్దేశం కాదు. అవసరమైతే వాటిని తొలగించేందుకు సిద్ధంగా ఉన్నాం అని నిర్మాత రామసామి ప్రకటించారు. 7శాతం జీఎస్టీ వసూలు చేసే సింగపూర్‌లో ఉచిత వైద్యసదుపాయాలు అందిస్తున్నారు. కానీ, ఇక్కడ 28 శాతం జీఎస్టీ వసూలు చేసే మన ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయలేకపోతుంది. పైగా మందుల(ఔషధాల) 12 శాతం జీఎస్టీ విధించిన ఈ ప్రభుత్వం.. మన ఆడపడుచుల కాపురాలు కూల్చే మందు(మద్యం)పై మాత్రం జీఎస్టీ విధించలేదు అని విజయ్‌ మారన్‌ పాత్రలో డైలాగులు చెబుతాడు. దీంతో బీజేపీ మండిపడగా.. చిత్రం విడుదలైనప్పటికీ అది ముదిరి చివరకు రాజకీయాంశంగా మారిపోయింది.

సింగపూర్‌లో ఫ్రీ వైద్యసదుపాయాలన్న మాట అవాస్తవమని బీజేపీ అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి చెబుతున్నారు. ఇన్సూరెన్స్ కోసం ఆదాయంలో 10 శాతం కోత విధించటం అక్కడ తప్పనిసరని.. అలాంటప్పుడు ఉచితం అనే పదం డైలాగుల్లో వాడటం సొంత పాలకులను కించపరిచినట్లే అవుతుందని నారాయణన్‌ అంటున్నారు.

ఈ విషయంపై ఇప్పటిదాకా విజయ్ పెదవి విప్పక పోయినప్పటికీ.. ఆయన తండ్రి, సీనియర్ దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్‌ స్పందించారు. చిత్రంలో తన కుమారుడు చెప్పిన డైలాగులు తప్పేం కాదని ఆయన అన్నారు. బీజేపీ సొంత నేతలే జీఎస్టీ, నోట్ల రద్దును తప్పు బట్టారని.. అలాంటప్పుడు చిత్రంలో వాటికి సంబంధించిన డైలాగులు ఉండటం తప్పేం కాదని చంద్రశేఖర్‌ చెబుతున్నారు. మరోపక్క రాజకీయ వర్గాలతోపాటు సౌత్‌ ఇండియన్ ఆర్టిస్ట్ అసోషియేషన్ కూడా మెర్సల్ కు మద్దతుగా నిలుస్తోంది. సెన్సార్ సమయంలోనే అలాంటి వాటికి కట్‌ చెప్పాలి. ఇప్పుడు రిలీజ్ అయ్యాక వాటిని వివాదం చేయటం సరికాదు. ఇది భావ స్వేచ్ఛ హక్కును హరించటమే అన్నది  అసోషియేషన్‌ వాదన.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top