పోర్చుగల్‌కి బై | manmadhudu 2 porchugal schedule completed | Sakshi
Sakshi News home page

పోర్చుగల్‌కి బై

May 13 2019 3:25 AM | Updated on Jul 23 2019 11:50 AM

manmadhudu 2 porchugal schedule completed - Sakshi

నాగార్జున

కొన్ని రోజులుగా పోర్చుగల్‌లో మన్మథుడు హంగామా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఫారిన్‌లో కెమెరా ముందు మన్మథుడి అల్లరికి ఫుల్‌స్టాప్‌ పడింది. పోర్చుగల్‌కి బై బై చెప్పనున్నారు ‘మన్మథుడు 2’ టీమ్‌. నాగార్జున హీరోగా ‘చిలసౌ’ ఫేమ్‌ రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మన్మథుడు 2’. ఇందులో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయికగా నటిస్తున్నారు. సమంత, కీర్తీ సురేశ్‌ కీలక పాత్రలు చేస్తున్నట్లు తెలిసింది. తొలుత స్మాల్‌ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో కంప్లీట్‌ చేసిన చిత్రబృందం ప్రస్తుతం పోర్చుగల్‌ షెడ్యూల్‌ని కూడా పూర్తి చేసింది. ‘‘పోర్చుగల్‌ షెడ్యూల్‌ పూర్తిచేశాం.

కొంచెం కష్టంగా అనిపించినా సెట్‌లో ఫన్‌ ఉండటంతో ఈ 32రోజుల షెడ్యూల్‌ను హ్యాపీగా కంప్లీట్‌ చేశాం’’ అని రాహుల్‌ రవీంద్రన్‌ పేర్కొన్నారు. అక్కడ కీలక తారాగణంపై ముఖ్య సన్నివేశాలతోపాటుగా ఓ పాటను చిత్రీకరించినట్లు తెలిసింది. అంటే మన్మథుడు అండ్‌ టీమ్‌ బ్యాక్‌ టు హోమ్‌ అన్నమాట. ఈ షెడ్యూల్‌లోనే సమంత కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రావు రమేష్, నాజర్, ఝాన్సీ, ‘వెన్నెల’ కిశోర్, దేవ దర్శిని కీలక పాత్రలు చేస్తున్నారు. నాగార్జున, పి. కిరణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ చైతన్య భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నారు. 2002లో కె. విజయభాస్కర్‌ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన ‘మన్మథుడు’ చిత్రానికి ఇది సీక్వెల్‌ అని తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement