ఇప్పుడేమో ఇంతవాణ్ణి...రేపు అవుతా నీ అంతవాణ్ణి | Mahesh Babu's upcoming movie '1 Nenokkadine' | Sakshi
Sakshi News home page

ఇప్పుడేమో ఇంతవాణ్ణి...రేపు అవుతా నీ అంతవాణ్ణి

Aug 9 2013 12:38 AM | Updated on Sep 1 2017 9:44 PM

ఇప్పుడేమో ఇంతవాణ్ణి...రేపు అవుతా నీ అంతవాణ్ణి

ఇప్పుడేమో ఇంతవాణ్ణి...రేపు అవుతా నీ అంతవాణ్ణి

కృష్ణ నటించిన ‘గూఢచారి 117’(1989)లో మహేష్ బాలనటునిగా నటించారు. అందులో కృష్ణ, మహేష్‌లపై చిత్రీకరించిన ఓ పాట ఉంది. ఆ పాటలో కృష్ణను ఉద్దేశించి మహేష్ అంటారు.. ‘‘ఇప్పుడేమో ఇంతవాణ్ణి... రేపు అవుతా నీ అంత వాణ్ణి’’ అని.

కృష్ణ నటించిన ‘గూఢచారి 117’(1989)లో మహేష్ బాలనటునిగా నటించారు. అందులో కృష్ణ, మహేష్‌లపై చిత్రీకరించిన ఓ పాట ఉంది. ఆ పాటలో కృష్ణను ఉద్దేశించి మహేష్ అంటారు.. ‘‘ఇప్పుడేమో ఇంతవాణ్ణి... రేపు అవుతా నీ అంత వాణ్ణి’’ అని. బహుశా... ఆ టైమ్‌లో తథాస్తు దేవతలు ‘తథాస్తు’ అన్నారేమో. నిజంగానే... తండ్రిని మించిన ‘సూపర్‌స్టార్’ అయిపోయారు మహేష్. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా పేరు ‘1’ టైటిల్‌కు తగ్గట్టే ఆ స్థానానికి అతి చేరువలో ఉన్నారాయన. అనుభవం వల్ల రాటు తేలిన నటులు కొందరుంటారు. జన్మతః నటులైనవాళ్లు కొందరుంటారు.
 
 మహేష్‌ది రెండో కేటగిరి. నాలుగేళ్ల వయసులో దాసరి ‘నీడ’(1979)తో నటుడయ్యారాయన. బాలనటునిగా మహేష్ చూసిన స్టార్‌డమ్ వేరే ఏ నటుడూ చూడలేదంటే అతిశయోక్తికాదు. పోరాటం, శంఖారావం, బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు, అన్నాతమ్ముడు... ఇలా అన్నీ విజయాలే. ‘కొడుకు దిద్దిన కాపురం’ చిత్రమైతే అప్పట్లో ఓ సంచలనం. చిన్న వయసులోనే ద్విపాత్రాభినయం చేసి ‘ఒమెగాస్టార్’ అనిపించుకున్నారు మహేష్. బాలనటునిగా ఉంటూ కుయిలీతో ఐటమ్ సాంగులూ, రామిరెడ్డితో సింగిల్ ఫైట్లు చేసిన క్రెడిట్ మహేష్‌ది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు కదా... ఇదే. ఆ వయసులోనే సోలో హీరోగా ‘బాలచంద్రుడు’ చిత్రంలో నటించారాయన. ఇక హీరోగా మారాక ‘రాజకుమారుడు’లో మహేష్ నటన చూసి చాలామంది అన్న మాట ఒక్కటే. ‘కుర్రాడు బాగున్నాడు.
 
 నటనే అతికించినట్టుంది’ అని. కానీ తర్వాత్తర్వాత హాలివుడ్ పెర్‌ఫార్మెన్స్‌ని టాలీవుడ్‌కి రుచిచూపించి విమర్శించిన వారినిసైతం విస్తుపోయేలా చేశారు మహేష్. ‘ఎవడు కొడితే... రికార్డుల దిమ్మతిరిగి పాదాక్రాంతమవుతాయో... వాడే మహేష్‌బాబు’ అనిపించేలా... తన రికార్డ్‌లను తానే అధిగమిస్తూ... ‘సూపర్‌స్టార్’ అనే బిరుదుకి అర్హునిగా నిలిచారు. ప్రస్తుతం యువతరానికి మహేష్ ఓ రోల్‌మోడల్. అమ్మాయిలకైతే... ఆయనే కలల రాకుమారుడు. అంత ఎదిగినా... అంతకంత ఒదిగి ఉండటం మహేష్ ప్రత్యేకత. ఒక్కో సందర్భంలో ఆయన్ను చూస్తే అంతర్ముఖునిగా అనిపిస్తుంది. 
 
 తను, తన కుటుంబం, తన సినిమాలు, తన అభిమానులు.. ఇవే తప్ప మరో విషయం పట్టదాయనకి. ప్రసుతం మహేష్ డైరీ ఓ అయిదేళ్ల వరకూ ఖాళీ లేదు. ‘1’ తర్వాత.. శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘ఆగడు’, క్రిష్ డెరైక్షన్‌లో ‘శివమ్’ చేయబోతున్నారు. కొరటాల శివతో ఓ సినిమా, పూరీ జగన్నాథ్‌తో ఓ సినిమా...కూడా ఆయన చేయనున్నట్లు సమాచారం. ఇవిగాక ఇంకా లైన్లో చాలామందే ఉన్నారు. మరి ఈ సినిమాలన్నీ ఎప్పుడు పూర్తి చేస్తారో ఆయన. నేడు మహేష్ పుట్టినరోజు. ఆయన అభిమానులకు ఇది నిజంగా పండుగరోజే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement