బిగ్‌బాస్‌: కౌశల్‌ ఆర్మీ భారీ ర్యాలీ

Kaushal Army Rally In Hyderabad - Sakshi

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ చరిత్రలో నూతన అధ్యాయానికి తెరతీసింది కౌశల్ ఆర్మీ. నగరంలో ఆదివారం కౌశల్ ఆర్మీ 2కె వాక్‌ నిర్వహించింది. ఇంకా ఫైనల్‌ అంకానికి కొన్ని ఎపిసోడ్‌లు మాత్రమే మిగిలి ఉండటంతో కౌశల్ ఆర్మీ తమ సోషల్ మీడియా యాక్టివిటీని మరింత ముమ్మరం చేశారు. కేవలం సోషల్ మీడియాలో ట్వీట్లకు మాత్రమే పరిమితం కాకుండా కౌశల్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను బలనిరూపణ ద్వారా తెలియజేసేందుకు వాక్‌ను ఏర్పాటు చేశారు. మాదాపూర్‌లో నిర్వహించిన ఈ వాక్‌కు అభిమానుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది.  

కొన్ని రోజుల క్రితం కౌశల్ ఆర్మీ సోషల్ మీడియా ద్వారా ర్యాలీలో పాల్గొనాలని అభిమానులు పిలుపునిచ్చింది. దీనికి ఊహించని మద్దతు లభించింది. సగటు ప్రేక్షకుడే కాదు.. బిగ్‌బాస్ కూడా ఆశ్చర్యపోయేలా ఈ వాక్‌కు విశేషమైన మద్దతు దక్కడం ఇక్కడ విశేషం. ఇందుకోసం ప్రత్యేకంగా కౌశల్ ఆర్మీ పేరుతో ముద్రించిన టీ షర్ట్‌లను, పోస్టర్స్‌ విడుదల చేశారు.

బిగ్‌బాస్ హౌస్‌లోని సభ్యులంతా కౌశల్‌ని టార్గెట్ చేయడం.. ఒంటరిని చేసి గ్రూపులు కట్టడంతో కౌశల్‌కు అండగా కౌశల్ ఆర్మీ ఏర్పాటైంది. ఈ కౌశల్ ఆర్మీకి ప్రేక్షకుల మద్దతు బాగా పెరిగిపోయింది. చివరకు బిగ్‌బాస్ షోను శాసించే స్థాయికి ఈ కౌశల్ ఆర్మీ పెరిగిపోయింది. హైదరాబాద్‌లో నిర్వహించిన 2కె వాక్‌కు స్థానిక అభిమానులు ఈ రేంజ్‌లో హాజరైతే... రెండు తెలుగు రాష్ట్రాల్లో కౌశల్ ఆర్మీ ప్రభంజనం ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 

ఒక కంటెస్టెంట్‌‌కి సపోర్ట్‌గా నిలుస్తూ.. బలనిరూపన కోసం హైదరాబాద్ వేదికగా 2కె వాక్‌ నిర్వహిస్తున్నారు కౌశల్ అభిమానులు. నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్‌ 2లో టైటిల్ రేస్‌లో ముందున్న కౌశల్‌కి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు మద్దతుగా కౌశల్ ఆర్మీ చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. ఎపిసోడ్ ప్రారంభమైంది మొదలు ఆయనకు అనుకూలంగా ప్రత్యర్థి కంటెస్టెంట్స్‌కు వ్యతిరేకంగా వరుస పోస్ట్‌లు కుప్పలుతెప్పలుగా దర్శనం ఇస్తున్నాయి. 

ఇంత పాపులారిటీ ఎలా వచ్చింది.. 

నిన్న మొన్నటి వరకూ పెద్దగా పరిచయం లేని ఈ పేరు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ అవుతుందంటే.. కౌశల్ ప్రభావం బిగ్‌బాస్‌ షో‌లో ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బిగ్‌బాస్‌ ప్రారంభం నుండి హౌస్‌లో అందరూ ఒక వైపు ఇతనొక్కడు ఒకవైపు. ఎవరు అవునన్నా కాదన్నా.. అనుకున్నది అనేస్తాడు, చేయాల్సింది చేసేస్తాడు. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు ముఖంపైనే చెప్పేస్తాడు. అందుకే ఆయన బిగ్‌బాస్‌ హౌస్‌లో ఏకాకిగా మారారు. హౌస్ మేట్స్ ఆయన వెంట లేకపోతేనేం.. కోట్లాది మంది అభిమానుల్ని గెల్చుకున్నారు. 

బిగ్‌బాస్‌ అంటే కౌశల్.. కౌశల్ అంటే బిగ్ బాస్ అన్న రేంజ్‌లో తోటి కంటెస్టెంట్స్‌ కుళ్లుకుని నువ్ బిగ్ బాస్‌వా? అని తింగరి మొహం వేసేలా డిక్టేటర్‌గా మారి టైటిల్‌ రేస్‌లో టాప్ 1 ప్లేస్‌లో ఉన్నారు కౌశల్. కౌశల్ ఆర్మీ ప్రభావంతో హౌస్‌లో ఎవ్వరుండాలో డిసైడ్ చేసే స్థాయికి ఎదిగారు కౌశల్. కౌశల్ ఎఫెక్ట్‌తో.. కిరీటి, భాను శ్రీ, బాబు గోగినేని, దీప్తి సునయన, తేజస్వి, గణేష్, నందిని ఇలా వరుసగా ఎలిమినేషన్‌కి వెళ్లారంటే కౌశల్‌తో గొడవ పెట్టుకోవడమే ప్రధాన కారణం అని ఆయన ఫ్యాన్స్ భావన. ఇక సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కౌశల్ ఆర్మీ పోస్టులే దర్శనం ఇస్తున్నాయి. ఏమాత్రం పరిచయం లేని ఓ వ్యక్తికి ఊహించని స్థాయి పాపులారిటీ రావడం అనేది సామాన్యమైన విషయం కాదు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top